NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖ పట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హమీ ఇచ్చారు. కాగా అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్‌ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందిగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 28 నుంచి ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు..
ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించటం దేశంలో తొలిసారి.. సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయితీలకు తీర్చి దిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. 44 వేల కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి.. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనపడటం లేదు.. వైసీపీ వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీల ఆదాయం పడిపోయింది.. పంచాయతీలను బలోపేతం చేయటం మా ప్రభుత్వ లక్ష్యం.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీలు కీలకంగా మరాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

విశాఖలోని కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళన..
విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక‌ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్.. కేజీహెచ్ లో బాధితులతో మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహాకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు. కోటి రూపాయల ఎక్సగ్రేషియా అందిస్తామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది..
తెలంగాణలో టీఆర్ఎస్ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడి ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ ముంన్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలన్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని తెలిపారు. దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టామన్నారు. మోడీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదన్నారు.

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..
ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవితను అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కవితకు చికిత్స అందిస్తున్నారు. కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆమెకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. కాగా.. ఇటీవల కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో మనీలాండరిగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు. కవితపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసినా.. ఈడీ చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని వారు ధర్మాసనాన్ని కోరగా, ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.

సీబీఐ, పోలీసుల రికార్డుల్లో తేడా? సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. విచారణ సందర్భంగా వైద్యులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోల్‌కతా రేప్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీబీఐ, కోల్‌కతా పోలీసులు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును గురువారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. సీబీఐ సీల్డ్ కవరులో నివేదికను సమర్పించింది. కోల్‌కతా పోలీసుల నిర్లక్ష్యాన్ని సీబీఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అనుమానం వచ్చి విచారించిన వారి వివరాలు కూడా స్టేటస్ రిపోర్టులో ఉన్నాయి. దీంతో పాటు ఘటనాస్థలికి భద్రత లేదని దర్యాప్తు సంస్థ నివేదికను కూడా దాఖలు చేసింది. కోల్‌కతాలో ఉన్న సీబీఐ బృందం అదనపు డిటెక్టర్, డీఎస్పీ నేతృత్వంలో ఈ నివేదికను సిద్ధం చేసింది. కోల్‌కతా పోలీసులు కూడా ఈ కేసు స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కోల్‌కతా పోలీసులు తన నివేదికలో వివరణ ఇచ్చారు. సీబీఐ నిర్లక్ష్యం ఆరోపణలను కోల్‌కతా పోలీసులు తప్పుబట్టారు.

ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ఆగస్టు 22న ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో వెంటనే తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తిరువనంతపురం విమానాశ్రయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం దిగింది. ఆ తర్వాత అతన్ని ఐసోలేషన్ బేలో ఉంచారు. తిరువనంతపురంలో 135 మంది ప్రయాణికులను సురక్షితంగా దించారు. AI 657 (BOM-TRV) ఆగస్టు 22న 7:30 గంటలకు బాంబు బెదిరింపును నివేదించింది. 07:36 గంటలకు టీఆర్వీ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానం ఐసోలేషన్ బేలో పార్క్ చేయబడింది. విమానంలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రస్తుతం విమానాశ్రయ కార్యకలాపాలు నిశ్శబ్దంగా ఉన్నాయి.

విరాట్ కోహ్లీ గొప్ప నటుడు.. సినిమాల్లోకి మాత్రం రావొద్దు!
స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గొప్ప నటుడు అని, అయితే సినిమాల్లోకి మాత్రం రావొద్దని కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముఖేష్ ఛబ్రా అంటున్నారు. క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన అనంతరం క్రీడారంగంలోనే కొనసాగాలని, రంగుల ప్రపంచంలోకి వచ్చే సాహసం మాత్రం అస్సలు చేయొద్దని సూచించారు. విరాట్ ఎన్నో యాడ్స్ చేశాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా పలు టీవీ యాడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. రణవీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్‌లో ముఖేష్ ఛబ్రా మాట్లాడుతూ… ‘విరాట్‌ కోహ్లీ గొప్ప నటుడు. అతను ఢిల్లీకి చెందినవాడు. పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన అతడు జీవితాన్ని చదివేశాడు. విజయాన్ని ఎంతో నేర్పుగా అదిమిపట్టుకున్నాడు. లుక్స్, ఫిట్‌నెస్, మానసికంగా.. అన్నింటిలో శ్రద్ధ తీసుకున్నాడు. విరాట్ గొప్పవాడు, తెలివైనవాడు. అతడు చాలా ఫన్నీగా ఉంటాడు. బాగా డ్యాన్స్‌ చేస్తాడు, మిమిక్రీ చేస్తాడు, కామెడీ టైమింగ్‌ కూడా బాగా ఉంటుంది. విరాట్ మన దేశం గర్వపడే స్థాయికి ఎదిగాడు. విరాట్ క్రీడారంగంలోనే కొనసాగాలి. రిటైర్‌మెంట్‌ అనంతరం సినిమాల్లోకి రాకూడదు’ అని అన్నాడు.

నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని
మెగాస్టార్ చిరంజీవి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా తల్లి అంజనమ్మ, భార్యా పిల్లలతో కలిసి తిరుమలకు వచ్చిన మెగాస్టార్ శ్రీవారి గురువారం (ఆగస్టు 22) ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో బుధవారం (ఆగస్టు 21)రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ చేరుకున్న చిరంజీవి కుటుంబం రాత్రి తిరుమలలో బస చేసి తెల్లవారు జామునే శ్రీవారిని దర్శించుకున్నారు.అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈశ్వర్ రాయల్ అనే వీరాభిమాని శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లుదండాలతో మెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం బలిజేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. నిన్న చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమల బయలుదేరారు.

అడ్డంగా దొరికేసిన అల్లు అర్జున్.. ఇలా బుక్కయ్యాడేంటి?
ఎప్పుడెప్పుడు సినిమా వాళ్ళ నుంచి మీమ్ కంటెంట్ దొరుకుతుందా? అని మీమర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోలు మీడియా ముందే మాట్లాడి దొరికేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. నిన్న జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో మీమర్లను ఆకర్షించే విధంగా ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హీరోని చూసి అందరూ ఆయనకు ఫాన్స్ అవుతారు కానీ నేను ఫ్యాన్స్ ని చూసి హీరోని అయ్యానని అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ అసలు ఇదేమి లాజిక్ రా నాయనా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి ఎవరికైనా హీరో అయ్యాకే ఫాన్స్ రెడీ అవుతారు, ఫ్యాన్స్ అయ్యాక హీరో అవ్వడం అనేది లాజిక్ లేని అంశం. మరి బన్నీ ఆ లాజిక్ మిస్ అయ్యాడో లేక ఇంకేదైనా చెప్పాలి అనుకుని మాటలు కుదరక ఇలా చెప్పాడో అర్థం కావడం లేదు. నిజానికి బన్నీ చాలా బాగా మాట్లాడుతాడు గతంలో ఇదే విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది.