NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

విశాఖ స్టీల్ ప్లాంట్కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదు..
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు కొరత కొత్తగా వచ్చిన సమస్య కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తానని చేసిన ప్రకటనపై స్పందించడానికి కేంద్ర మంత్రి నిరాకరించారు. కాగా, రాష్ట్రంలో ఆకస్మిక వరదలు రావడంతో నష్టాన్ని పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కేంద్ర ఉక్క, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. నష్ట నివేదికలు కేంద్రానికి అందాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని అన్నారు. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు మోడీ సర్కార్ నిధులు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు.

సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి రిజిస్ట్రేషన్ ల శాఖ చెల్లు చీటి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా, మంత్రి అనగని సత్య ప్రసాద్ ప్రతిపాదనలు పంపారు. క్షేత్రస్థాయి పర్యటనలు నేపథ్యంలో తాము గమనించిన ఆఫీస్ సెటప్ లో మార్పులు తీసుకురావాలని నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు సర్క్యులర్ జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఆరేంజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ పేర్కొనింది. ఇక, సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కు ఉన్న ఎత్తైన పోడియం సీటింగ్ చుట్టూ వున్న రెడ్ క్లాత్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ చైర్ కూడా ఫ్లోర్ హైట్ లో ఉండాలని ఆయన చుట్టూ ఎలాంటి పార్టిషన్ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. భూములు రిజిస్ట్రేషన్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే సామాన్య ప్రజలకు ఆఫీస్ లో అత్యధిక గౌరవం ఉండాలి అని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు వచ్చినవారు నిలబడి వుండే విధానానికి స్వస్తి పలికారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే వారికి టీ, మంచినీరు ఆఫర్ చేసి గౌరవించాలని ఈ మేరకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా సర్క్యులర్ జారీ చేశారు.

నిమజ్జన ఉత్సవాల్లో ఇబ్బందులు కలిగితే అధికారుల దృష్టికి తీసుకురండి..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండప నిర్వహకులు సాధ్యమైనంత వీలుగా వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసి సహకరించగలరన్నారు. నిమజ్జనం సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 17వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎటువంటి అపోహలు దుష్ప్రచారాలు నమ్మవద్దు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరం కలిసి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామన్నారు. నిమజ్జన ఉత్సవాల్లో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు..
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆంక్షలపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పైనుంచి నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, ట్యాంక్ బండ్ పై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. అనంతరంలో హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కొత్త రూల్స్ తెచ్చి ప్రభుత్వం భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనాలు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 2022, 2023లో ఇలాగే చెప్పారని, చివరకు ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోకుంటే సోమవారం హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలను మినిస్టర్ క్వార్టర్స్ లోనికి అనుమతించక పోవడంతో తోపులాట చోటుచేసుకుంది. మినిస్టర్ క్వార్టర్స్ ముందు బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నేతలు బైఠాయించారు. జీవో నెంబర్‌ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక విద్యార్థులకు మెడికల్‌ సీట్లు కేటాయించాలని.. వెంటనే నీట్ మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ధర్నా చేపట్టారు. తెలంగాణలోని నాన్ లోకల్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వొద్దని ఆందోళనకు దిగారు. గణేష్ నిమజ్జనం జరుగుతుండగా బీఆర్‌ఎస్ విద్యార్థి నాయకుల ఆందోళనపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేశారు. పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తా’.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ఎక్సైజ్ పాలసీ ‘స్కాం’ కేసులో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ పెద్ద ప్రకటన చేస్తూ.. ‘రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తాను’ అని ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈరోజు నుంచి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నాను. సీఎం కుర్చీలో కూర్చోను. కేజ్రీవాల్ నిజాయితీపరుడని ప్రజలు తీర్పు ఇచ్చే వరకు నేను కుర్చీలో కూర్చోను. సతేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ కూడా త్వరలో బయటకు వస్తారు. ఢిల్లీ ప్రజలు మా కోసం ప్రార్థించారు. వారికి నా ధన్యవాదాలు… జైల్లో ఎన్నో పుస్తకాలు చదివాను – రామాయణం, గీత… భగత్ సింగ్ జైలు డైరీని నా వెంట తెచ్చుకున్నాను. భగత్ సింగ్ డైరీని కూడా చదివాను.” అని వ్యాఖ్యానించారు.

మెక్సికోలో ఒక వారంలో 19 హత్యలు.. ఇంట్రా-కార్టెల్ యుద్ధం ప్రారంభమవుతుందని భయం
మెక్సికోలోని సినాలోవాలో నిరంతర కాల్పుల ఘటనల కారణంగా.. ఇంట్రా-కార్టెల్ యుద్ధం మొదలవుతుందనే భయం పెరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే కొత్త హింసాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. సినాలోవా రాష్ట్రంలో మరో ఏడు హత్యలు నమోదయ్యాయని, దీంతో మృతుల సంఖ్య 19కి చేరుకుందని మెక్సికన్ అధికారులు శుక్రవారం తెలిపారు. సోమవారం, గురువారం మధ్య 12 హత్యలు నమోదయ్యాయి. ఒక వారంలోపు ఈ మరణాల తరువాత, సినాలోవా ప్రాస్పెక్టస్ ఆఫీస్ శుక్రవారం చివరిలో ఒక ప్రకటనలో కొత్త బాధితులు నాలుగు వేర్వేరు ప్రదేశాలలో కనుగొనబడినట్లు తెలిపింది. రాజధాని క్యూలియాకాన్‌లో ఇద్దరు వ్యక్తులు.. కాంకోర్డియా మునిసిపాలిటీలో ఐదుగురు మరణించారు. రెండూ నేర సమూహాల మధ్య హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలుగా వర్ణించబడ్డాయి. పసిఫిక్ తీరంలోని సినాలోవా, ఒకప్పుడు కింగ్‌పిన్ జోక్విన్ “ఈఎల్ చాపో” గుజ్మాన్ నేతృత్వంలోని శక్తివంతమైన డ్రగ్ గ్యాంగ్ సినాలోవా కార్టెల్ స్థావరం. ప్రస్తుతం అమెరికాలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. జూలైలో మరొక గ్యాంగ్‌స్టర్ నాయకుడు ఇస్మాయిల్ “ఈఎల్ మేయో” జంబారా అరెస్టు అంతర్గత కలహాలు, అంతర్గత తగాదాల భయాలకు ఆజ్యం పోసింది.

రోహిత్ vs బాబర్.. బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్
బాబర్ ఆజం వర్సెస్ రోహిత్ శర్మ మధ్య ఎవరు మంచి కెప్టెన్ అనే ప్రశ్నపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పందించాడు . వీరిద్దరిలో యూనిస్ ఖాన్ మంచి కెప్టెన్‌ని ఎంచుకున్నాడు. టెలిగ్రాఫ్‌తో యూనిస్ ఖాన్ మాట్లాడుతూ.. “బాబర్ రోహిత్ ఇద్దరూ తమ జట్టుకు గొప్ప ఆటగాళ్లు. కానీ కెప్టెన్‌గా, రోహిత్ బాబర్‌ను అధిగమించాడు. రోహిత్‌కు బాబర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇది కాకుండా.. హిట్‌మ్యాన్ స్వయంగా గొప్ప కెప్టెన్‌కి శిక్షణ ఇచ్చాడు. నేను కెప్టెన్‌గా మారడానికి ముందు చాలా మంది గొప్ప కెప్టెన్‌ల క్రింద ఆడాను కాబట్టి.. కాబట్టి నేను బాబర్ కంటే రోహిత్ మెరుగైనవాడిగా భావిస్తున్నాను.” అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

విజయ్ చివరి సినిమాకు అవెంజర్స్ హీరో స్థాయి రెమ్యునరేషన్..?
తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. KVN ప్రొడక్షన్స్ లో విజయ్ నటించబోయే ఈ సినిమాకు గాను కెరీర్ హయ్యెస్ట్ పారితోషకం అందుకోనున్నాడట KVN ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా కోసం విజయ్ కు అక్షరాలా 275 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వనుందట. ఈ స్థాయి రెమ్యునరేషన్ ను ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా తీసుకోలేదు. మరోవైపు హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్ గా నటించిన రాబర్ట్ డౌనీ ఎండ్ గేమ్ సినిమాకు రూ. 270 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు 69 వ సినిమాకు విజయ్ హాలీవుడ్ నటుడి స్థాయి రెమ్యునరేషన్ తో రికార్డు సృష్టించాడు. H. వినోద్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను దాదాపుగా రూ. 650 – 700 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది KVN నిర్మాణ సంస్థ. ఇటీవల విడుదలైన విజయ్ GOAT సినిమాకుగాను రూ. 200 కోట్లు పారితోషకం తీసికున్నాడు ఈ తమిళ హీరో.

నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. అతని గత సినిమాలు కమర్షియల్ హిట్‌లుగా మారడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో నాని సినెమాలు సంచలనం సృష్టించాయి. దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు మొత్తం తొమ్మిది అవార్డులు గెలుచుకున్నాయి. దసరాలో నాని అద్భుత నటనకు గాను అతనికి ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్‌కి ఉత్తమ నటి, శ్రీకాంత్ ఒదెలకి ఉత్తమ దర్శకుడు మరియు దీక్షిత్ శెట్టికి ఉత్తమ సహాయ పాత్రతో సహా ఈ చిత్రం నాలుగు అవార్డులను అందుకుంది. నాని నటించిన మరొక సినిమా హాయ్ నాన్నా. SIIMA 2024 అవార్డ్స్ లో ఈ సినిమా మొత్తం ఐదు అవార్డులను గెలిచి అత్యధిక అవార్డ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఉత్తమ నటనకు గాను మృణాల్ ఠాకూర్‌కు ఉత్తమ నటి (క్రిటిక్స్), శౌర్యువ్‌కి ఉత్తమ నూతన దర్శకుడు మరియు హేషమ్ అబ్దుల్ వహాబ్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ నూతన నిర్మాతగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, ఉత్తమ సహాయ నటిగా బేబీ కియారా సైమా అవార్డ్స్ గెలుపొందారు.