కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం..
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్యాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం రాసుకొచ్చారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయం అన్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోట పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి.. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు.. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు ఆ పోస్టులో పేర్కొన్నారు.
తెలుగు భాష, యాసలపై కోట శ్రీనివాసరావుకు మంచి పట్టు ఉంది..
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు.. తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది.. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు.. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు.. కోట శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని హౌస్ అరెస్ట్ డ్రామా..
నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు.. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే మేము హౌస్ అరెస్టు చేయలేదని చెప్పారు.. నిన్న గుడివాడలో జెడ్పీ చైర్మన్ హారిక, రాము దంపతులు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు.. గతంలో జరిగిన జడ్పీ సమావేశాల్లో కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించింది అని పేర్కొన్నారు. తప్పు చేసిందే కాకుండా బీసీ కార్డు తెరపై తెస్తున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇక, సభలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు.. ఆ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఉపేక్షించే లేదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ జాడ కూడా కనపడదు.. మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా ఫ్లెక్సీ చించి, అశాంతిని సృష్టించాలని చూస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గంగధర్ ని ఆదేశించామని మంత్రి రవీంద్ర వెల్లడించారు.
రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట వైసీపీ శ్రేణులపై వేధింపులు..
బీసీ మహిళ, కృష్ణా జిల్లా జెడ్పి చైర్ పర్సన్ ఉప్పాల హరికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా ఖండించారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తుంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తుంటే, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆయన వాపోయారు. మనం ఏపీలోనే ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అన్నట్టుగా వ్యవహారం ఉందన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఏడాదిపైగా వైసీపీ శ్రేణులపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని మార్గాని భరత్ ఆరోపించారు. ఇప్పటికి, వేలాది మంది వైసీపీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేస్తున్నారని మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. ఈ రోజు నాటిన విత్తనం రేపొద్దున మహా వృక్షమై పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు. ఎప్పుడూ ఒకరి దగ్గరే అధికారం ఉండబోదు అనేది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ..!
ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా.. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా.. హర్యానా గవర్నర్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా.. ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే, మంత్రి కొండ సురేఖ అమ్మవారికి బోనం సమర్పించి.. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది జాతర వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుండగా.. ప్రజాప్రతినిధుల హాజరుతో ఆలయ ప్రాంగణం హడావిడిగా మారింది.
ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కార్యకర్తల దాడి..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనై తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. ఈ సంఘటన హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంలో చోటుచేసుకుంది. జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీసుకు చేరుకొని నినాదాలు చేస్తూ కార్యాలయ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోయారు. వారు కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నకు సెక్యూరిటీగా ఉన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాల్పుల శబ్దంతో సమీప ప్రాంత ప్రజల్లో కలవరం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడుల ఘటనలో మల్లన్న ఆఫీస్ కార్యాలయం రక్తసిక్తమైంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు తీన్మార్ మల్లన్న గన్‌మెన్ కాల్పుల అంశాన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
కోటన్న వెళ్లిపోయాడు.. లైవ్ లో ఏడ్చిన బాబు మోహన్..
కోట శ్రీనివాస్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న బాబు మోహన్ ఆయన ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు. కోట శ్రీనివాస్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ అందరికంటే నాకు ఆత్మీయుడు. నాకు సొంత అన్న లాంటి వాడు. ఆయనకు తమ్ముడు ఉన్నా నన్నే సొంత తమ్ముడిగా చూసుకున్నారు. మొన్న సాయంత్రం కూడా ఓ షూటింగ్ విషయంలో ఫోన్ చేశాను. ఎప్పుడు వస్తావ్ రా అని అడిగాడు. రేపు వస్తానని చెప్పాను. నేను వచ్చేసరికి కోటన్న లేడు. వెళ్లిపోయాడు అంటూ ఏడ్చాడు బాబు మోహన్. తనను తాను తటపటాయించుకున్న తర్వాత మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్, నేను ఎప్పుడు కలిసినా చమత్కారంగానే మాట్లాడుకుంటాం. ఒకే ప్లేట్ లో తినేవాళ్లం. ఆయన ఎన్నో సార్లు నాకు అన్నం తినిపించారు. ఆయన ఎక్కడున్నా నాకు ఫోన్ చేయకుండా ఉండేవాడు కాదు. సినిమాల్లోకి వచ్చాక నాకు ఒక సపోర్ట్ గా ఉన్నాడు కోటన్న. ఆయన ఈ రోజు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన లాంటి వ్యక్తి మళ్లీ దొరకడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ తెలిపారు బాబు మోహన్.
ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రేపిన టైటిల్
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్‌ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో శివకార్తీకేయన్, విజయ్ ఆంటోనీల మధ్య సైలెంట్ వార్ నడిచినట్లు కోలీవుడ్ టాక్. చివరకు లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో టైటిల్ శివకు త్యాగం చేసి తన ప్రాజెక్టుకు టైటిల్ మార్చుకున్నాడు ఈ బిచ్చగాడు హీరో. తమిళంలో శక్తి తిరుమగన్, తెలుగులో భద్రకాళిగా పేరు మార్చాడు. ఈ మూవీని స్కామ్, పొలిటికల్ డ్రామాతో యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అరుణ్ ప్రభు. ఈ ప్రాజెక్టును సొంత నిర్మాణ సంస్థపై విజయ్ ఆంటోనీ నిర్మించి మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 5న తమిల్‌లో శక్తితిరుమగన్ గా, తెలుగులో భద్రకాళిగా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు విజయ్ ఆంటోనీ.
మీ యాక్టింగ్‌కు ఓ దండం రా బాబు.. చప్పట్లతో ఇంగ్లాండ్ పరువు తీసిన భారత ఆటగాళ్లు..!
భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ఉద్వేగ క్షణాల మధ్య తెగ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లలో ఇరు జట్లు 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. అయితే, మూడో రోజు ఆట చివర్లో అసలు హంగామా జరిగింది. భారత ఆటగాళ్లు, ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీపై తమ అసహనాన్ని బహిరంగంగానే చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ గా మారాయి. ఆట మూడో రోజు భారత తొలి ఇన్నింగ్స్ 145/3 ఓవర్ నైట్ స్కోర్ తో ప్రారంభమై చివరికి 387 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అదే స్కోరు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా నమోదు చేయడంతో లీడ్స్ లో లీడ్ ఎవరికీ దక్కలేదు. ఇక మొదటి ఇన్నింగ్స్ అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. జస్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేసే సమయంలో జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరూ సమయాన్ని వృథా చేసే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో బంతి వేయడానికి బుమ్రా రన్నప్ తీసుకున్న తర్వాత క్రాలీ ఆగిపోవడం, గాయానికి ఫిజియోను పిలవడం వంటి వ్యూహాత్మక ఆలస్యాలకు తెరలేపారు. ఇది చూసిన భారత ఆటగాళ్లకు తీవ్ర అసహనం కలిగింది.
