జగన్ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే చంద్రబాబు- పవన్- బీజేపీ కుట్ర
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్ తో పాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు.. ఇక, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి ఆ సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వాళ్లు చేసిన యుక్తలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు ఒక తాటిపైకి వచ్చి జగనన్న అడుగుల్లో అడుగు వేసి ముందుకు సాగాలని కోరారు. మరోసారి జగన్ కు అధికారం అప్పగిస్తే.. మరింత చక్కటి పరిపాలన రూపొందించుకోగలమని ప్రజలు గుర్తించాలన్నారు.. జగనన్న ప్రత్యేకకు అండగా ఆసరాగా అభయహస్తంగా నిలిచారని మంత్రి జోగి రమేష్ అన్నారు..
గీతాంజలి ఆత్మహత్యకు టీడీపీ- జనసేన సోషల్ మీడియా వేధింపులే కారణం
గీతాంజలి ఆత్మహత్యకు టీడీపీ- జనసేన సోషల్ మీడియా వేధింపులే కారణమని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ఆరోపించారు. వేధింపులకు కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిందితులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ గీతాంజలి రాజకీయంగా ఏమీ మాట్లాడకపోయినా ఎందుకు వేధింపులకు గురి చేశారు.. జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పడమే తప్పా అని ఆమె ప్రశ్నించారు. గీతాంజలి పిల్లలకు దిక్కేవరు? అన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ- జనసేన పార్టీలకు ఓటమి తప్పదనే భయం నెలకొంది.. ఆ ఓటమి భయంతోనే సామాన్య మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా.. ఎందుకో తెలుసా..?
ముద్రగడ పద్మనాభం వైసీపీ లో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఇక, ఈ నెల 15 లేదా 16 ముద్రగడ ఫ్యామిలీ మాత్రమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ పద్మనాభం ఓ లేఖను రాశారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ:.. “గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి.. 14-3-2024 తేదిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్సీపీ లోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్ళాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి.. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటి ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి.. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొక సారి క్షమాపణ కోరుకుంటున్నానండి.. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి.. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి” అని ముద్రగడ పద్మనాభం తెలియజేశారు.
ఆరూరి రాజీనామా ప్రకటన.. హనుమకొండలో పొలిటికల్ హై డ్రామా..
హనుమకొండలోని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానంటూ ఆరూరి రమేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆరూరి రమేష్ బీజేపీతో సంప్రదింపులు జరిపిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్‌ఎస్ నేతల రంగ ప్రవేశంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సీనియర్ నేత హరీశ్ రావు ఆదేశాల మేరకు ఉదయం ప్రశాంతనగర్ లోని అరూరి ఇంటికి బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్ తదితర పార్టీల నేతలు వెళ్లారు. ప్రెస్ మీట్ లో పాల్గొనకుండా అరూరిని అడ్డుకున్నారు. పంపిస్తే వస్తామని హరీష్ రావుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. పార్టీ డిమాండ్ చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆ సమయంలో ఆరూరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ఆరూరి అనుచరులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే అరూరిని బలవంతంగా శాంతింపజేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. “చివరి నిమిషంలో వస్తే?” ఈ సందర్భంగా అరూరి కన్నీళ్లు పెట్టుకోలేదు. అయితే హరీష్ రావు సాయంత్రం వస్తారని, అంతా మాట్లాడతారని ఆరూరికి చెప్పారు. వారితో కాసేపు మాట్లాడి అక్కడికి వచ్చిన కారులో ఆరూరి ఎక్కారు. అంతే అక్కడ పొలిటికల్ డ్రామా షురూ అయ్యింది.
రేవంత్ రెడ్డి పై మరోసారి స్పందించిన బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్
సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలను చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు. మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. మాతృ మూర్తుల కోసం ప్రధాని పౌష్ఠిక ఆహారం పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతా రహితంగా ఉందనేది అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావస్తుందన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి చూస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం కూలీ పోవాలని బీజేపీ కోరుకోవడం లేదన్నారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం పడిపోకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా ఉన్నారని స్వయంగా రేవంత్ రెడ్డి అంటున్నాడని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు వచ్చి కలుస్తున్నారని తెలిపారు. మా ప్రభుత్వానికి అండగా ఉంటామని చెబుతున్నారని రేవంత్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి కి ఎందుకు అంత అభద్రతా భావం ఉంది? అని ప్రశ్నించారు.
ప్రణీత్రావు కేసు.. ప్రత్యేక టీంకు బదిలీచేసిన పోలీసులు
తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరిసిల్ల జిల్లా రాజన్న నివాసంలో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. రాత్రికి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.. అయితే.. ప్రణీత్ రావు కేసును ప్రత్యేక టీంకు బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ప్రణీత్ రావు కేసు విచారణ అధికారిగా జూబ్లీహిల్స్ ఏసీపీని ఉన్నతాధికారులు నియమించారు. ప్రణీత్ రావును పూర్తి స్థాయిలో విచారిన జరపనున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ప్రత్యేక పోలీస్ టీం ప్రణీత్ రావును రిమాండ్ తరలించనున్నట్లు సమాచారం. ఎస్ ఐబీ లాగర్ రూమ్ లోని హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి పక్కా ప్రణాళికతో ప్రణీతరావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌బీకి రిపోర్టు చేశారు. అక్కడ చేరిన రెండు రోజులకే అనారోగ్యంతో సెలవు పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు వారం రోజుల ముందు ఆయన డీసీఆర్‌బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ పరారీలో ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో ప్రణీతరావు కోసం పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చి దాడి చేసి అరెస్ట్ చేశారు.
నేడు బీజేపీ రెండో జాబితా.. 90 మంది అభ్యర్థులు ఖరారు!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయింది. ఇటీవలే మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. ఈరోజు రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రెండో జాబితాలో 90 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్ సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, బీహార్, హిమాచల్ ప్రదేశ్ మరియు తెలంగాణలలోని లోక్‌సభ స్థానాలపై చర్చలు జరిగాయట. ఈ సమావేశంలో 90 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఘన విజయం సాధించింది. ప్రధాన నిందితుడిని ఏజెన్సీ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అధికారులు అతడిని విచారిస్తున్నారు. అధికారిక సమాచారం త్వరలో ఏజెన్సీ అందించనుంది. పేలుడు కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని షబ్బీర్‌గా గుర్తించినట్లు సమాచారం. అతను కర్ణాటకలోని బళ్లారి జిల్లా కౌల్ బజార్ ప్రాంతంలో నివాసి. ప్రస్తుతం నిందితుడి విచారణ కొనసాగుతోంది.
మార్చి 1న బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించింది. పేలుడుకు ఐఈడీని ఉపయోగించారు. ఈ ఉగ్రవాద కుట్రలో 9 మంది గాయపడ్డారు. టైమర్ ఉపయోగించి IED బాంబును ప్రేరేపించడం వల్ల పేలుడు సంభవించింది. ఈ ఘటన తర్వాత పోలీసులు పలు సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు కనిపించాడు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడు కేఫ్‌లో ఇడ్లీ ప్లేట్‌ను తీసుకెళ్లడం కనిపించింది. ఆ సమయంలో అతడి భుజంపై బ్యాగ్ ఉంది. మరో సీసీటీవీ ఫుటేజీలో అదే అనుమానితుడు బ్యాగ్‌తో కేఫ్ వైపు వెళుతున్నట్లు కనిపించింది.
డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ సీజన్ ద్వారా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్.. కోలుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు నాలుగు నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న హార్దిక్.. ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం హార్దిక్ పాండ్యా దేశవాళీ, జాతీయ జట్టుకు ఆడకుండా నేరుగా ఐపీఎల్‌లో ఆడడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. డబ్బు సంపాదన ముఖ్యమే అని, అందులో తప్పు ఏమీ లేదు కానీ తొలుత రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ‘గత రెండు నెలల్లో హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడలేదు. జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీల్లోనూ బరిలోకి దిగలేదు. నేరుగా ఐపీఎల్‌లోనే ఆడేందుకు సిద్దమవుతున్నాడు. దీనిని ఎలా చెప్పాలో తెలియడం లేదు. డబ్బు సంపాదన ముఖ్యమే. అందులో తప్పు ఏమీ లేదు. కానీ ముందుగా రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుంది’ అని అన్నాడు.
ఆ దెబ్బకు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ పతనం కనపడడంతో.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా దిగువకు పడిపోయాయి. ఈ దెబ్బకి మార్కెట్ లో ఆల్ రౌండ్ క్షీణత స్పష్టంగా కనపడుతోంది. నేడు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో దాదాపు 4 శాతం మేర నష్టపోయింది. ఇదే తరహా నిఫ్టీ మిడ్ క్యాప్ లో కనపడుతోంది. ఇక్కడ కూడా 4 శాతానికి పైగా నష్టపోయింది. నేడు వార్తలు అందేసరికి సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు పైగా నష్టపోయి.. 72,930 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మరోవైపు నిఫ్టీ 250 పాయింట్ల వరకు క్షీణించి 22,060 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంకోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 240, 1890 పాయింట్లు నష్టపోయాయి. అలాగే సెక్టోరల్ ఇండెక్స్ లో చూస్తే కేవలం ఎఫ్‌ఎంసీజీ మాత్రమే లాభాలలో ఉంది. నేటి ట్రేడింగ్ లో టాప్ లూజర్లలో అదానీ ఎంటర్‌ప్రైస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టిపీసి, కోల్ ఇండియాలు ఉండగా.. అదే మాదిరి టాప్ లాభాల స్టాక్స్ చూస్తే ఐటిసి, కోటక్ మహీంద్రా, ఐసీసీఐ బ్యాంక్, బ్రిటానియా, నెస్లేలు వరుసగా ఉన్నాయి.
