సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
నైపుణ్యం కలిగిన మానవ వనరులకు, సహజ వనరులకు కొదవలేదు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండి అంటూ పారిశ్రామిక దిగ్గజాలకు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉందన్నారు.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోందని వెల్లడించారు.
డయల్ 100కి కాల్.. పోలీసులు రాగానే దాడి..!
ఎవరైనా సమస్య ఉంటే డయల్ 100కి కాల్ చేస్తారు.. పోలీసులు రాగానే వారికి సమాచారం చెప్పి.. సమస్య ఇది అని వారి దృష్టికి తీసుకెళ్లారు.. ఎవరు రాకపోయినా.. డయల్ 100కి కాల్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారనే నమ్మకం ప్రజల్లోకి కలిగింది.. కాల్ రీసీవ్ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఘటనా స్థలంలో వాలిపోతున్నారు పోలీసులు.. తక్షణ సాయం అందిస్తున్నారు.. కానీ, విశాఖపట్నంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకుని.. వెళ్లే పోలీసులు టెన్షన్ పడేలా చేస్తోంది.. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి.. విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 12 గంటలకి ఒక అపార్ట్‌మెంట్ నుంచి డయల్ 100 కి కాల్ వచ్చింది.. దీంతో, హుటాహుటిన కాల్ చేసిన ప్రాంతానికి చేరుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు.. అయితే, 100కి కాల్ చేసింది ఫుల్‌గా మద్యం సేవించిన ఉన్న ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌గా గుర్తించారు.. సదరు వాచ్‌మన్‌ని కాల్ సమాచారం కోసం వివరాలు అడిగారు కానిస్టేబుళ్లు లక్ష్మణరావు, కిషోర్.. కానీ, మద్యం మత్తులో ఉన్న వాచ్‌మన్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.. మాటామాట పెరగడంతో.. పోలీసులను వెంబడించాడు.. తన దగ్గర ఉన్న ఐరన్ రాడ్‌తో పోలీసులను ఉరికించాడు.. వారి తలపై రాడ్డుతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఆ వాచ్‌మన్ బారినుంచి తప్పించుకున్న పోలీసులు.. తలపై తీవ్రగాయాలు అవడంతో సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చేరారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్ పోలీసులు..
విద్యార్థులకు శుభవార్త.. ఇక పరీక్షాపత్రాలు తెలుగులో
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 కోసం ఇంగ్లీష్‌లోనే ప్రశ్నాపత్రం ఉండాలనే నిబంధనను సడలించింది. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్-ఉర్దూ వెర్షన్‌లలో ఉంటాయి. ఇంతకుముందు ఇది ప్రత్యేక ఆంగ్లంలో కూడా ఉండేది. TS EAMCET వివిధ సెషన్లలో నిర్వహించబడుతున్నందున, ప్రశ్న పత్రాలు వివిధ క్లిష్ట స్థాయిలలో ఉండే అవకాశం ఉంది. ఏ విద్యార్థికి నష్టం జరగకూడదని నిర్ధారించడానికి, విద్యార్థుల స్కోర్లు సాధారణీకరించబడతాయి. ఈ నేపథ్యంలో TS EAMCET 2023లో ప్రత్యేకమైన ఆంగ్ల ప్రశ్నపత్రాన్ని తీసివేయాలని నిర్ణయించారు. స్కోర్‌లను సాధారణీకరించేటప్పుడు, అభ్యర్థులు స్కోర్ చేసిన మార్కులను సెషన్‌ల వారీగా తనిఖీ చేస్తారు మరియు ప్రశ్నపత్రం యొక్క క్లిష్టత స్థాయి ఆధారంగా అభ్యర్థుల మార్కులు కొద్దిగా తగ్గించబడతాయి లేదా పెంచబడతాయి. గత కొన్ని సంవత్సరాలుగా, చాలా మంది పట్టణ విద్యార్థులు TS EAMCETలో ప్రత్యేకమైన ఆంగ్ల ప్రశ్న పత్రాలను ఎంచుకుంటున్నారు మరియు ఇంగ్లీష్-తెలుగు లేదా ఇంగ్లీష్-ఉర్దూ వెర్షన్‌ను ఎంచుకునే గ్రామీణ అభ్యర్థులు సాధించిన సగటు మార్కులతో పోల్చినప్పుడు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను చూసిన తర్వాత, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న JNTU హైదరాబాద్ TS EAMCET 2023 కోసం ఇంగ్లీష్-మాత్రమే ప్రశ్నపత్రాన్ని తొలగించాలని నిర్ణయించింది.
ఫిరాయింపులతో తెలంగాణలో బీజేపీ విజయం సాధించలేదు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హాత్ సే హాత్ జోడో యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమం కొనసాగుతోంది. 19వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అయితే.. నిన్న హుస్నాబాద్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అన్నారు. కేసీఆర్, వినోద్ ఎంపీలు అయిన తెలంగాణ రాలే అని, పొన్నం ప్రభాకర్ ఒక్కసారి ఎంపీ అయి తెలంగాణ తెచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం బయ్యారం ఉక్కు కార్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులను రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ఏమైనా చేశాడా. ఈ విషయంలో పొన్నంతో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ఫిరాయింపులతో తెలంగాణలో బీజేపీ విజయం సాధించలేదని, సర్దార్ సర్వాయి పాపన్న వారసులు ఈ గడ్డ మీద ఉన్నారన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన 45 లక్షల కేంద్ర బడ్జెట్‌లో ఒక్క రూపాయి అయిన ప్రత్యేకంగా తెలంగాణకు మోడీ గారు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. మోదీ 9 ఏళ్లలో రైతులకు రుణ మాఫీ చేయరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయరు.
కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులు.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. ఏ కూతురైనా ఎవరైనా తనకు హాని తలపెడితే వచ్చి తండ్రికి చెప్పుకుంటుంది. కానీ తండ్రే నీచానికి ఒడిగడితే ఎవరికి చెప్పుకోవాలి. అలాంటి దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. తండ్రి చేసిన ఈ ఘాతుకానికి 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి తాలూకాలోని తన ఇంట్లో 14 ఏళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, పోలీసులు సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిందని ఒక అధికారి తెలిపారు. క వాలివ్‌లోని తన కుటుంబ నివాసంలో మూడు రోజుల క్రితం మరణించిందని, గురువారం నోట్ దొరికిందని ఆయన చెప్పారు. ఆమె మరణించిన తర్వాత బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిందని కేసు నమోదు కాగా.. అమ్మాయి రాసిన సూసైడ్ నోట్‌లో, ఆమె తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఆమె తన తల్లితో తన సమస్యను చెప్పుకున్నప్పటికీ.. దానిపై తల్లి ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిసింది. ఇక ఆత్మహత్యే శరణ్యమని ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌లో, బాలిక తన తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత్‌పై ఆసీస్ విజయం.. 2-1 ఆధిక్యంలో టీమిండియా
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆసీస్ జట్టు మూడో టెస్టులో భారత్‌పై ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. హ్యాట్రిక్ నమోదు చేయాలని భావించిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆసీస్ తొలి విజయం సాధించడంతో టీమిండియాకు ఆఖరి టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో టీమిండియా ముందంజలో ఉంది. ఇండోర్ వేదికగా బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభించడంతో టీమిండియా మొదటి రోజే కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్ కోహ్లి 22, శుభ్‌మన్ గిల్ 21 పరుగులు చేయగా మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. 109 పరుగులకే భారత్ ఆలౌట్ కాగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్ నడ్డి విరుస్తారని భావించిన సగటు అభిమానులకు నిరాశే ఎదురైంది. జడేజా 4, అశ్విన్ 3, పేసర్ ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీసినప్పటికీ ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్ ఖవాజా 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇదిలా ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే అర్థశతకం చేయగా.. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులతో కాస్త రాణించగలిగాడు. మూడో రోజు ఆట మొదలుకాగానే అశ్విన్ ఖవాజాను ఔట్ చేసినప్పటికీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ 49 పరుగులతో అదరగొట్టగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 28 పరుగులు చేశాడు.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఇంట్లో చొరబడిన దుండగులు.. కేసు నమోదు
ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో 20, 22 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు, తాము గుజరాత్ నుంచి వచ్చామని, తమ అభిమాన హీరోను కలవాలనే వచ్చామని పేర్కొన్నారు. అంతకు మించి దురుద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై ఏమైనా నేరచరిత్ర ఉందేమో అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. యువకులిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టిన ‘పఠాన్’ విజయంతో షారూఖ్ దూసుకుపోతున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల మార్కును దాటింది. జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కూడా యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో నటించారు. షారుక్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రాలైన ‘జవాన్’ , ‘డుంకీ’ కోసం సిద్ధమవుతున్నాడు.
అన్నగారి కుటుంబం నుంచి కొత్త హీరో లాంచ్… మార్చ్ 5 టైటిల్
నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని వెళ్లాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని కూడా ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్లాప్స్ నుంచి బయటకి వచ్చి మినిమం గ్యారెంటీ సినిమాలని చేస్తున్నాడు. బింబిసార సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ‘డెవిల్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇలా ముగ్గురు హీరోలు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బసవ తారకరామా క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ని స్థాపించి చైతన్య కృష్ణ హీరోగా డెబ్యు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతేడాది మే నెలలో చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. బాలయ్య లాంచ్ చేసిన ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి నందమూరి కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త హీరో ఎంతవరకూ ప్రేక్షకులని మెప్పిస్తాడు అనేది చూడాలి. మరోవైపు బాలయ్య కొడుకు నందముర్ మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369కి సీక్వెల్ గా స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడు అనే మాట ఇండస్ట్రీలో ఉంది. ఈ టైం ట్రావెల్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? కథని అందిస్తున్న బాలయ్యనే దర్శకత్వం వహిస్తాడా? మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తాడా అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.