పవన్, లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్ సవాల్.. ఆ ధైర్యం ఉందా.?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సవాల్ విసిరితే.. ఆ సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ కి సవాల్ విసిరారు.. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా.. అంటూ లోకేష్, పవన్‌ను చాలెంజ్ చేశారు.. ఈ విషయాన్ని పాదయాత్రలో లోకేష్ ప్రకటించచగలరా..? అని నిలదీశారు.. ఇక, పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా..? అని ఎద్దేవా చేశారు.. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా? జగన్ గురించి మాట్లాడేది..? అంటూ మండిపడ్డారు అనిల్ కుమార్.. ఇక, మాకు పొత్తులు అవసరం లేదు.. అప్పుడు, ఇప్పుడు.. మేం సింగిల్ గానే పోటీ చేస్తాం అని ప్రకటించారు అనిల్ కుమార్ యాదవ్.. కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు ఆ సత్తా ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసలు గుప్పించారు.. ఉద్యోగాల్లో మా హయాంలో వచ్చిన అవకాశాలు గతం కంటే ఎక్కువ అని ప్రకటించిన ఆయన.. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు మొత్తం మా వైపే ఉన్నారు.. వైసీపీ అభ్యర్థులు ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. ప్రజాప్రతినిధులను ధైర్యంగా ప్రజల్లోకి పంపే ఒకే ఒక్క సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అనిల్ కుమార్ యాదవ్.
జనసేన కలిసి 175 స్థానాల్లో పోటీ.. సంచలన నిర్ణయాలు ఉంటాయి..
టీడీపీ 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదు.. కానీ, బీజేపీ, జనసేన పార్టీతో కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుందని పేర్కొన్నారు.. రాయలసీమకు సంబంధించిన చంద్రబాబు, వైఎస్ జగన్.. రాయలసీమను మోసం చేశారని విమర్శించారు.. మేం అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.. అయితే, ఏపీలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు.. టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెనాకాడుతుందన్న ఆయన.. టీడీపీ.. వైసీపీని ఎదురుకొనే స్థాయి లో లేదు.. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. ఇక, వైసీపీ పట్టభద్రులను ప్రలోభాలకు గురిచేస్తుందని ఆరోపించారు విష్ణువర్ధన్‌రెడ్డి.. వైసీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడడంలేదు.. చివరకు వార్తలు రాసిన జర్నలిస్టులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు.. హైకోర్టు చెప్పినా జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. సీఐపై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు.. ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయని వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.. ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటో గా తీసుకోరు అని ప్రశ్నించారు.. ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు అంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.
రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. తప్పించుకున్న ఓ కుటుంబం..
రన్నింగ్‌లో ఉన్న వాహనాల్లో మంటలు చెలరేగిన ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కొన్ని ప్రమాదాల్లో ఆ వాహనాల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నవారు కొందరైతే.. మరికొందరు.. ఆ మంటల్లోనే చిక్కుకుని అగ్నికి ఆహుతి అయిపోతున్నారు.. తాజాగా, హైదరాబాద్ శివారులో జరిగిన ఓ ప్రమాదం.. ప్రమాదం నుంచి ఓ కుటుంబం తప్పించుకుంది.. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు తన కారు కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరాడు నవీన్ అనే వ్యక్తి.. అయితే, షాద్‌నగర్‌లోని సోలిపూర్ శివారుకు కారు చేరుకోగానే.. బెంగళూరు జాతీయ రహదారి వంతెన సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఇది గమనించిన నవీన్ వెంటనే కారును నిలిపివేశారు.. కారులో ఉన్న తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి.. కారు నుంచి దించివేశాడు.. ఆ తర్వాత క్షణాల్లోనే కారు మొత్తం మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా.. కారు యజమాని సకాలంలో ప్రమాదాన్ని గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై ఆరా తీశారు.
హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇక, మూడు రోజుల పర్యటన కోసం ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రులు ఆర్కేరోజా, వేణుగోపాల కృష్ణ వైజాగ్‌కు రానున్నారు.. ఈరోజు పలువురు పారిశ్రామిక వేత్తలు వచ్చే అవకాశం ఉంది.. ప్రత్యేక విమానంలో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లిఖార్జున రావు.. ఇతర ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విశాఖ విచ్చేయనున్నారు. మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.. ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు విశాఖకు రానున్న నేపథ్యంలో 2500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సమ్మిట్ జరిగే ఏయూ నుండి విమానాశ్రయం వరకు, బీచ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల తాకిడి దృష్ట్యా.. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.. ఇక, శుక్ర, శనివారాలు బీచ్ కు వెళ్లేవారు తమ వాహనాలను ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలని సూచించారు సీపీ శ్రీకాంత్.
లవర్ కోసం స్నేహితుడి హత్య.. ఏపీలో వెలుగుచూసిన మరో దారుణం..
లవర్ కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ప్రేయసి కోసం.. తన స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేశాడు హరిహర కృష్ణ అనే యువకుడు.. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటనే ఒక ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.. ప్రియురాలి వివాదంతో యువకుని హత్య కేసును చేధించారు పోలీసులు.. జనవరిలో కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.. మురళీకృష్ణను హత్య చేసింది స్నేహితులు దినేష్ కుమార్, కిరణ్ కుమార్‌గా గుర్తించారు.. దినేష్ కుమార్ ప్రియురాలు నగ్న వీడియోలను ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని మురళీకృష్ణ బ్లాక్ మెయిల్ చేసినట్టుగా గుర్తించారు.. అయితే, మురళీకృష్ణ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యాత్నం చేసింది. ఇక, ప్రియురాలిని వేధించాడని కక్ష పెంచుకున్న దినేష్.. జనవరి 25వ తేదీన మురళీకృష్ణను పంచలింగాల దగ్గరకు తీసుకుకెళ్లాడు.. తన ప్లాన్ ప్రకారం.. కత్తితో గుండెలపై పొడిచాడు.. దీంతో, మురళీ కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు.. ఈ హత్య కోసం దినేష్ కుమార్ తన స్నేహితుడు కిరణ్ కుమార్ సాయం తీసుకున్నాడు.. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు.. అయితే, తన కుమారుడు కనిపించడం లేదని ఆందోళనకు గురైన మురళీకృష్ణ కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. లవర్ కోసం దినేష్ కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు.. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు.. మురళీకృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువ లో 10 కిలోమీటర్ల మేర గాలించినా.. ఇంకా మురళీకృష్ణ మృతదేహం దొరకలేదు.. ఎదినకొడుకు ఇలా దారుణ హత్యకు గురికావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు మృతుడు మురళీకృష్ణ కుటుంబ సభ్యులు.
ముంబైలో ఆస్పత్రుల పాలవుతున్న జనం.. కారణం తెలిసినా ఏం చేయలేని వైనం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జనాలు గాలి పీల్చుకునేందుకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నగరంలో గాలి నాణ్యత ఎన్నడూ లేనంత దారుణ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత తగ్గుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గత మూడు నెలలుగా గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత వారం రోజుల్లోనే రెట్టింపైంది. నగరంలో ఇప్పుడు జనం జలుబు, తలనొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మానవ ఆరోగ్యంపై ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని డాక్టర్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడిన నగరాల్లో ముంబై ఒకటి. ఆ తర్వాత ఈ స్థాయిలో జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతుండటం ఇదే ప్రథమంగా చెప్తున్నారు. ప్రపంచంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ముంబై నిలిచింది. మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కూడా ఇదే. స్విట్జర్లాండ్ కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ తాజాగా నిర్వహించిన వీక్లీ సర్వేలో ఈవివరాలు వెల్లడయ్యాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల గాలి నాణ్యతను తనిఖీ చేసి ఎయిర్ ట్రాకింగ్ఇండెక్స్ను ఐక్యూ ఎయిర్ రూపొందించింది. ఇంతకుముందు వరకు దేశంలో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఉండగా.. ఇప్పుడా స్థానంలోకి ముంబై వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈసారి కలుషిత నగరాల టాప్10 లిస్టులో ఢిల్లీ పేరు లేదు.
అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అదానీ గ్రూప్ – హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక నుండి ఉత్పన్నమయ్యే సమస్యపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీలో ఓపీ భట్, నందన్ నీలేకని, కేసీ కామత్, సోమశేఖర్ సుందరం సభ్యులుగా ఉంటారు. సెబీ నిబంధనలలోని సెక్షన్ 19 ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరలలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని కూడా అపెక్స్ కోర్ట్ సెబీని ఆదేశించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొనసాగుతున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. పెట్టుబడిదారులను రక్షించేందుకు నియంత్రణ యంత్రాంగాలను కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందా, స్టాక్ ధరల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ ప్రపంచం అందంగా ఉంది…
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం సంతోష్ శోభన్ కి అందని ద్రక్షాగానే ఉంది. 2023 స్టార్ట్ అయ్యి రెండు నెలలు మాత్రమే కంప్లీట్ అయ్యాయి కానీ ఇప్పటికే సంతోష్ శోభన్ రెండు సినిమాలని రిలీజ్ చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్యాడ్ రిజల్ట్ నే ఫేస్ చేశాయి. ఈసారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకోని సమ్మర్ లో ‘అన్ని మంచి శకునములే’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు సంతోష్ శోభన్. భారి బడ్జట్ సినిమాలతో పాటు విషయం ఉన్న చిన్న సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ మూవీని నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అన్ని మంచి శకునములే సినిమా గతేడాది డిసెంబర్ 21నే విడుదల కావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది. తాజాగా మార్చ్ 4న ‘అన్ని మంచి శకునములే’ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యనున్నారు. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, టీజర్ కన్నా ముందు ‘అన్ని మంచి శకునములే’ సినిమా ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసే పనిలో ఉన్నారు. వరసగా ఒక్కో క్యారెక్టర్ ని రివీల్ చేస్తున్న మేకర్స్… ఇప్పటివరకూ నరేష్, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్, గౌతమీ, రావు రమేష్ పాత్రలకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ చాలా లైవ్లీగా ఉండి, ఒక పాజిటివ్ ఫీల్ ని తెచ్చేలా ఉన్నాయి. టీజర్ కూడా బాగుంటే సంతోష్ శోభన్ ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ వేసి ‘అన్ని మంచి శకునములే’ సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
రజనీకాంత్ తో మరో సినిమా! అధికారిక ప్రకటన వచ్చేసింది!!
సూపర్ స్టార్ రజనీకాంత్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పటికే రెండు సినిమాలు నిర్మించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సంబంధించిన ప్రకటనను వెలువరించింది. రజనీకాంత్ తో ఈ సంస్థ ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ను 2018లో తెరకెక్కించింది. అలానే ఆ తర్వాత రెండేళ్ళకు రజనీకాంత్ తో ‘దర్బార్’ మూవీని ప్రొడ్యూస్ చేసింది. మార్చి 2, గురువారం లైకా ప్రొడక్షన్స్ ఫౌండర్ శుభకరన్ పుట్టిన రోజు సందర్భంగా రజనీకాంత్ తో తీయబోయే సినిమా విశేషాలను అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ దర్శకుడు టి. జె. జ్ఞానవేల్ తో మూవీని నిర్మించబోతునట్టు లైకా సంస్థ తెలిపింది. దీనికి అనిరుథ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. వచ్చే యేడాది ఈ సినిమాను విడుదల చేస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. ఇది రజనీకాంత్ కు 170వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘జైలర్’ సినిమా విడుదలలో కొంత జాప్యం జరిగే ఆస్కారం ఉందని కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. కొత్త విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది.
ఏమున్నాడ్రా బాబు… సిక్స్ ప్యాక్ గ్యారెంటీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండే మహేశ్ బాబు, ప్రస్తుతం జిమ్ లో కూర్చోని కండలు పెంచే పనిలో పడ్డాడు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లు ఉన్నాడు. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే మహేశ్ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మాత్రం సిక్స్ ప్యాక్ గ్యారెంటీ అనే ఫీలింగ్ రాకమానదు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మహేశ్ బాబు కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో మహేశ్ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంలో చిన్న శాంపిల్ చూపిస్తూ ఈ జిమ్ ఫోటోలు బయటకి వచ్చాయి. మహేశ్ ట్రైనర్ తీసిన ఈ ఫోటోల్లో మహేశ్ బాబు ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్, టోన్డ్ బాడీతో మహేశ్ బాబు మస్త్ ఉన్నాడు. అతడు, ఖలేజ సినిమాలతో ఘట్టమనేని అభిమానులకి హిట్ బాకీ ఉన్న త్రివిక్రమ్ ఈ సారి మాత్రం SSMB 28 సినిమాతో ఆ బాకీని వడ్డీతో సహా తీర్చేయ్యబోతున్నట్లు ఉన్నాడు. ఆగస్ట్ లో రిలీజ్ కానున్న ఈ మూవీలో మహేశ్ పక్కన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. SSMB 28 ప్రాజెక్ట్ అయిపోగానే మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవ్వనుంది. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కూడా మహేశ్ బాబు ఫిజిక్ పెంచాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ నుంచి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవనున్నాయి.