NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

శంషాబాద్ ఎయిర్ పోర్టు.. విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..
హైదరబాద్‌ శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో విమాన ల్యాండింగ్‌ విషయంలో గందరగోళ పరస్థితి నెలకొంది. ఎయిర్‌ పోర్టులో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గమ్యం చేరుకున్నాము అనుకున్న ప్రయాణికులకు గట్టిగా షాక్‌ తగిలింది. క్షణాల్లో దిగే సమయంలో ఒక్కసారిగా విమానం టేకాఫ్‌ కావడంతో.. భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. కాసేపు తరువాత మళ్లీ పైలట్ విమానం సేఫ్ గా లాండింగ్ చేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వైజాగ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది. అక్కడినుంచి సేఫ్‌ గానే బయలు దేరిన విమానానికి ఏం జరిగిందో తెలియదు కానీ పైలెట్‌ విమానం రన్ వే పై ల్యాండ్ అవుతూనే క్షణాల్లో మళ్ళీ టేకాఫ్ తీసుకున్నాడు. ఫ్లైట్ రన్ వైఫై దిగకుండా టేక్ ఆఫ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. పైలెట్‌ ఎందుకు మళ్లీ టేక్‌ఆప్‌ చేశాడనేది వారికి కాసేపు గుండె ఆగినట్లు అయ్యింది. ఏదైనా ప్రమాదంలో ఉన్నామా? అనే ప్రశ్నలు కదులుతున్న సమయంలో మళ్లీ ఐదు నిమిషాల తర్వాత విమానం సేఫ్ గా లాండింగ్ చేశాడు పైలట్. ఫ్లైట్ సేఫ్ గా లాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సమయంలో రన్ వే పై విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతోనే ఇబ్బంది ఎదురైందని ప్రయాణికులకు క్లారీటీ ఇచ్చారు. ఎవరికి ఏమీ ప్రాణహానీ జరగలేదని వెల్లడించారు. విజిబిలిటీ సరిగా లేనందువల్లనే ఇలా జరిగిందని తెలిపారు.

7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం
హైదారబాద్‌ లోని తాజ్ కృష్ణ లో G-20 స్టార్టప్-20 సదస్సు ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు 9దేశాల ప్రత్యేక ఆహ్వానితులు వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొన్నారు. స్టార్టప్ ల అభివృద్ధి ఎజెండాగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం వేచిచూడటం కంటే.. ఉద్యోగాలు సృష్టించే దిశగా నేటి యువత ముందడుగేస్తోందన్నారు. ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా’ ఆలోచన కారణంగానే యువతకు ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. 85వేలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్‌లతో ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అన్నారు కేంద్ర మంత్రి. ఈ స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి అని తెలిపారు. అందుకే ఈ వ్యవస్థను ప్రోత్సహించేలా పాలసీలు రూపొందించిందని అన్నారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానాలు మెరుగుపడిందని తెలిపారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని మరిన్ని కొత్త ఆలోచనలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..
Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి.. రేపటి నుంచి ఏపీలో మోసర్తు వర్షాలు కురవబోతున్నాయి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో ఈ వర్షాలు కురబోతున్నాయి.. ఇక, ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. ఈ నెల 31న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని.. ఈ నెల 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. అయితే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31 నాటికి వాయుగుండంగా మారనుందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.. ఇక, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందంటున్నారు.. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉంది.. మరోవైపు, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమిస్తాయి కనుక వర్షాలు పడవని.. చాలా అరుదుగా చెబుతున్నారు. సముద్రంపై తేమ ఎక్కువగా ఉండడంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలకు ఛాన్స్ ఉంటుందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.

లోకేష్ పాదయాత్రకు లక్ష్యం లేదు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఎన్ని అపశృతులతో మొదలైందో చూశాం అన్నారు.. మన ఆలోచన సక్రమంగా లేకపోతే మన ప్రయత్నం వృథా అవుతందని నమ్మకం.. లోకేష్ పాదయాత్ర చూస్తే అది నిజమనిపిస్తోందని విమర్శించారు. లోకేష్ పాదయాత్రకు ఓ లక్ష్యం లేదు అని ఆరోపించిన ఆయన.. అసలు ఏ లక్ష్యం కోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో రాష్ట్రంలో అప్రజాస్వామ్యక విధానాలు ఉండటంతో.. రాజ్యాంగ విరుద్ద పరిపాలనపై జగన్ పాదయాత్ర చేశారని తెలిపారు.. ఇక, ఎమ్మెల్యేలను సంవత్సరం పాటు సస్పెండ్‌ చేశారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు మైక్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు.. ఓటుకు నోటులో దోరికిపోయి ఇక్కడికి వచ్చి కులం కోసం రాజధాని కట్టుకుంటూ ప్రజలను మోసం చేశారని చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు మంత్రి అప్పలరాజు.. చంద్రబాబుకు వయస్సు మీరింది.. గతంలో ఏం మాట్లాడారో కూడా మర్చిపోతున్నారని విమర్శించారు. రేపు పార్టీకి దిక్కేవరు అనే ప్రయత్నాల్లో భాగంగా.. ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నారని.. లోకేష్ అవగాహణ లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.. శ్రీసిటి మేమో కట్టామంటారు.. రేపు అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ కూడా మేమే పెట్టాం అనేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.. అసలు చంద్రబాబు హయాంలో గుర్తుండే ఒక్క పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు..

ఓలా క్యాబ్‌లో పనిచేయని ఏసీ.. ఆ సంస్థ సీఈవోకు షాకిచ్చిన కోర్టు..
క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోతే కాసేపు డ్రైవర్‌పై చిర్రుబుర్రిలాడి ఊరుకుంటారు ప్రయాణికులు.. అయితే, ఓ ప్రయాణికుడు అక్కడితో ఆగలేదు.. క్యాబ్ అగ్రిగేటర్‌ ఓలా సేవల్లో లోపం ఉందంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.. దీంతో, అతగాడికి కోర్టులో ఊరట లభించింది.. అదే సమయంలో ఓలా సంస్థ సీఈవోకు షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఎందుకంటే క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోవడంపై ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్‌పై దావా వేసిన బెంగళూరు వ్యక్తి రూ.15,000 గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన కస్టమర్, వికాస్ భూషణ్, మార్చి 2022లో బెంగుళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌లో అగర్వాల్‌పై ఓలా సర్వీస్ వైఫల్యంపై ఫిర్యాదు చేశారు. ఓలా సహ వ్యవస్థాపకుడు మరియు సీఈవో అయిన భవిష్ అగర్వాల్, తమ వాహనంలోని ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ విరిగిపోయిన కారణంగా కంపెనీపై దావా వేసిన అసంతృప్తి చెందిన క్లయింట్‌కు 15,000 రూపాయలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది కోర్టు.

ఐసీయూలోనే తారకరత్న.. తాజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ప్రస్తుతం ఐసీసీయూలో తారకరత్నకు చికిత్స చేస్తున్నారు.. అత్యవసర చికిత్సలో భాగంగా ఎక్మో చికిత్స చేస్తున్నారు.. మరో 48 గంటల పాటు ఎక్మో చికిత్స అందించనున్నారు. కుప్పం నుంచి నిన్న అర్ధరాత్రి నందమూరి తారకరత్నను బెంగళూరుకు తరలించారు కుటుంబ సభ్యులు. బెంగళూరులో ఎక్మో చికిత్సను అందించే మూడు ఆస్పత్రిల్లో నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఒకటి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత.. నారాయణ హృదయాలయ ఆస్పత్రియే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చారు.. ఆ తర్వాత కుప్పం నుంచి నిన్న రాత్రి బెంగళూరుకు తరలించారు కుటుంబసభ్యులు.. ప్రస్తుతం ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.. ఇప్పటికే బాకృష్ణతో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు కూడా బెంగళూరులో ఉండగా.. ఇవాళ సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు చంద్రబాబు.. కాగా, నిన్న ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు తారకరత్న.. ఆ తర్వాత కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు.. ఇక, మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు..

పవన్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారు..!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై ఎవరివాదన వారిదే ఉంది.. ఇక, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.. వేర్పాటువాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరించారు. అవినీతిలో మునిగిపోయిన, పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రా న్ని విడగొట్టేస్తారా.. మేం చూస్తూ కూర్చొంటామా? దేశభక్తులం. ఇంకొక్కసారి ఏపీని విడగొడతామంటే.. తోలు తీసి కింద కూర్చోబెడతాం అంటూ ధ్వజమెత్తారు.. అయితే, పవన్‌ కల్యాణ్ కామెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారు.. రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చేస్తారని.. తీవ్రవాది అయితే ఏం చేస్తాడు? వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ ప్రజలను చంపేస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గళాన్ని వినిపించటానికి రోడ్డెక్కే ప్రజలను పవన్ కల్యాణ్‌ తీవ్రవాది అయి ఏం చేస్తాడు? అని నిలదీశారు కొడాలి నాని.. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటానికే మూడు ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకున్నామని స్పష్టం చేశారు..

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై ఫేక్‌ జీవో కలకలం.. పోలీసులకు ఫిర్యాదు
సోషల్‌ మీడియా ఎంట్రీ తర్వాత రియల్‌ ఏదో.. వైరల్‌ ఏంటో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది.. సున్నిత అంశాలపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టి వైరల్‌ చేయడమేకాదు.. ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు.. కొన్ని సార్లు కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా డమ్మీవి తయారు చేసి.. ఉద్యోగులను గందరగోళంలోకి నెడుతున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్‌ జీవో కలకలం రేపుతోంది.. ఫేక్ జీవోను సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. గతంలో 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ట్యాంపర్ చేసిన కేటుగాళ్లు.. ఫేక్‌ జీవోను సృష్టించారు.. అందులో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు అని పేర్కొన్నారు. అయితే, జీవోను ట్యాంపర్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఫేక్ జీవో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందోననే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.. జీవోను ట్యాంపర్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.. ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణపై కలకలం రేపుతోన్న ఫేక్ జీవోపై పోలీసుకు ఫిర్యాదు చేసింది ఆర్థిక శాఖ.. దీనిపై గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు ఆర్థిక శాఖ అధికారులు. ఇక, కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు డీఐపీ.. మొత్తంగా ఈ ఫేక్‌ జీవో.. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్‌ యుద్ధవిమానాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనాలో సుఖోయ్-30, మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్వాలియర్‌లోని ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన యుద్ధవిమానాలు ఒకదానికొకటి ఢీకొని కూలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం తర్వాత రెండు యుద్ధ విమానాల్లో మంటలు చెలరేగి కాలిపోయినట్లు సమాచారం. రోజు వారి ప్రాక్టీస్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల్లోని పైలెట్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ప్రమాద స్థలానికి ఐఏఎఫ్ రెస్క్యూ బృందం చేరుకుని చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, ఏయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. పైలెట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చార్టర్డ్‌ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపంతో ఆ విమానం కూలినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులను పంపినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. నగరంలోని ఉచైన్ ప్రాంతంలోని బహిరంగ మైదానంలో విమానం కూలిపోయిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ సింగ్ తెలిపారు.

నన్ను హతమార్చేందుకు మళ్లీ కుట్ర.. ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణలు
తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు అసిఫ్ అలీ జర్దారీ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చారని శుక్రవారం ఆరోపించారు. గతంలో చేసిన రెండు ప్రయత్నాలు విఫలమైన తర్వాత జర్దారీ తనను హత్య చేసేందుకు దేశ నిఘా సంస్థలతో కలిసి తాజా పథకం పన్నారని ఆరోపించారు. లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసం నుంచి వర్చువల్ విలేకరుల సమావేశంలో ఇమ్రామ్ ఖాన్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కో-ఛైర్మన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ కుట్రలో జర్దారీతో పాటు మరో ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. తనకు ఏదైనా జరిగితే దేశం వారిని ఎప్పటికీ క్షమించదన్నారు. జర్దారీ వద్ద అవినీతి సొమ్ము పుష్కలంగా ఉందని, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఆయన ఉపయోగిస్తున్నారని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.

ఆవు పేడే ఇంధనం..! త్వరలో రోడ్డెక్కనున్న కొత్త కార్లు
పెరిగిపోయిన పెట్రో ధరలు ఓవైపు.. వాతావరణ కాలుష్యం మితిమీరి పోతున్న నేపథ్యంలో.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నాయి.. ఇప్పటికే సాంప్రదాయ ఇంధనానికి స్వస్తిచెబుతూ.. గ్యాస్‌ వాహనాలు వచ్చాయి.. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించాయి.. ఆటోమొబైల్ కంపెనీలు, టెక్ కంపెనీలు గ్రీన్ బాట పడుతున్నాయి. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది.. స్థిరమైన చలనశీలత పరిష్కారాల కోసం బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి మారుతి ఆవు పేడను ఉపయోగిస్తుంది. మారుతి సుజుకి భారతదేశంలో బయోగ్యాస్ చుట్టూ CNG ఆటోమోటివ్ సొల్యూషన్‌లను అభివృద్ధి చేయాలని మరియు ఆఫ్రికా, ఆసియాన్ మరియు జపాన్‌తో సహా ఇతర వ్యవసాయ ప్రాంతాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోందని కంపెనీ గ్లోబల్ ప్రెజెంటేషన్‌లో తెలిపింది. దేశంలోని అతిపెద్ద ఆటోమేకర్లలో ఒకటైన మారుతీ సుజుకి ఇండియా, CNG, బయోగ్యాస్ మరియు ఇథనాల్ ఆటోమొబైల్స్ వంటి కార్బన్-న్యూట్రల్ అంతర్గత దహన ఇంజిన్ వాహనాలకు బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడానికి ఆవు పేడను ఉపయోగించే ప్రాజెక్ట్‌పై పని చేస్తోందని ఓ నివేదిక పేర్కొంది.. స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్‌లను కనుగొనడం మరియు దాని కార్ల నుండి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం మారుతి సుజుకి చేస్తున్న ప్రయత్నాలలో ఈ చొరవ భాగమని కంపెనీ తెలిపింది. ఆ నివేదిక ప్రకారం. జపనీస్ ఆటో మేజర్ 2030 వృద్ధి వ్యూహంపై గ్లోబల్ ప్రెజెంటేషన్‌లో.. ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ “పూర్తి శ్రేణి ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి, సుజుకి కేవలం బ్యాటరీ EVలను మాత్రమే కాకుండా CNG, బయోగ్యాస్ మరియు ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించే కార్బన్ న్యూట్రల్ అంతర్గత దహన ఇంజిన్ వాహనాలను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.. ఈ చొరవ కోసం, డెయిరీ అయిన ఆవు పేడ తక్షణమే అందుబాటులో ఉందని మరియు దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి సరఫరా చేయవచ్చని కంపెనీ తెలిపింది.