45 నిమిషాల్లోనే అయిపోయిన శ్రీవారి టికెట్లు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. రోజులతో సంబంధం లేకుండా వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటారు.. అయితే, ప్రత్యేక రోజుల్లో మరింత రద్దీగా ఉంటాయి తిరుమల గిరులు.. ఇక, వైకుంఠ ఏకాదశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది.. ఇక ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల రద్దీ తప్పదనే మరోసారి రుజువైంది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.. అయితే, కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే 2 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.. సర్వ దర్శనం భక్తులకు జనవరి 1వ తేదీన ఆఫ్ లైన్ విధానంలో టికెట్లను కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకి 50 వేల చొప్పున 5 లక్షల టికెట్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం..
2024 ఎన్నికల తర్వాత జగన్ లోటస్ పాండ్‌కే పరిమితం..
అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్లిపోయారు.. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి గంతే.. లోటస్ పాండ్‌లో కూర్చుంటారు అంటూ జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తున్నా రాష్ట్రంలో సుపరిపాలన లేదని విమర్శించారు.. వైసీపీ, టీడీపీ సొంత వ్యాపారాల కోసం పరిపాలనను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. అయితే, బీజేపీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది.. 2014 నుంచి ఇప్పటి వరకు రెట్టిపు కంటే జాతీయ రహదారులు వేశామని.. బెంగళూరు – విజయవాడ జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది మొదలు పెడతాం.. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ ఉత్పత్తి, ఎగుమతులు క్షీణించాయన్నారు జీవీఎల్ నరసింహారావు.. అసలు ఐటీ రంగనికి రాష్ట్రం చేసిందేంటి ? అని నిలదీశారు.. అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్ళిపోయాడు.. ఇక, 2024 ఎన్నికల తర్వాత జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు.. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో బయో టెక్నాలజీ పార్క్ ఇస్తామంటే రాష్ట్రం ముందుకు రావట్లేదని ఆరోపించారు.. కాపు రిజర్వేషన్ పై కేంద్రాన్ని ప్రశ్నించాం.. కానీ, రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదేనని స్పష్టం చేశారు.. కానీ, రాష్ట్ర ప్రభుత్యం బిల్లు చేసి పంపాము.. అని చెప్పి తప్పించుకుంటుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఎన్నికల్లో పోటీపై ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ..
వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందికోలేకపోయారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని చెబుతూనే ఉన్నారు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా.. తాను ఓటమి పాలైన లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తానని చెబుతూనే వస్తున్నారు వీవీ లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగారు.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. ఈ సారి ఏ పార్టీలో చేరతారు? ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అయ్యాయి.. అయితే, దీనిపై కూడా తేల్చేశారు లక్ష్మీనారాయణ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ సభ్యునిగా పోటీ చేస్తానని.. అదికూడా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేశారు.. జేడీ ఫౌండేషన్ సభ్యులు మరియు అతని శ్రేయోభిలాషుల సమావేశంలో లక్ష్మీనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జగన్ మురారి తెలిపారు. లక్ష్మీనారాయణను పలు పార్టీలు ఆహ్వానించినప్పటికీ సైద్ధాంతిక విభేదాల కారణంగా తమతో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మురారి తెలిపారు. విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా మరియు ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంగా మిగిలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీలపై కేంద్రం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.. పలు పార్టీలు తనకు ఆహ్వానం పలికాయి.. కానీ, సిద్ధాంతాలు కలవకపోవడం వల్ల ఏ పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారని ప్రకటించారు లక్ష్మీనారాయణ.. అందుకే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానన్నారు.. అది కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. విశాఖ ప్రజలు తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇచ్చారు.. అందుకే మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.. అయితే, తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పటికీ తన భావజాలానికి అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీకి మాత్రం మద్దతు ఇస్తానన్నారు.. ఇక, త్వరలో తన మేనిఫెస్టోను విడుదల చేస్తానని పేర్కొన్నారు..
జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్..
జీహెచ్‌ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న బల్దియా జనరల్ బాడీ మీటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. అయితే..ఈ కౌన్సిల్ మీటింగ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయితే.. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుల గొడవకు దిగారు. దీంతో.. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సర్ది చెప్పె ప్రయత్నం చేశారు. దీంతో.. సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అయితే.. గందరగోళం మధ్యనే 2023-24 బడ్జెట్‌ను ఆమోదించినట్లు ప్రకటించారు మేయర్ విజయలక్ష్మి. అయితే.. జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముసాయిదాను బడ్జెట్ వివరాలు.. 2023-24 సంవత్సరానికి బడ్జెట్ రూ. 6224 కోట్లు ప్రతిపాదించారు. 2022-23 సవరించిన బడ్జెట్ మొత్తం రూ. 6475 కోట్లు. 2023-24కు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ. 6224 కోట్లు. 2023- 24 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత రెవెన్యూ ఆదాయం రూ. 3967 కోట్లు. 2023 -24 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత రెవెన్యూ ఖర్చు రూ. 2667 కోట్లు. 2023- 24 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ సర్ ప్లస్ రూ. 1300 కోట్లు. ప్రతిపాదిత క్యాపిటల్ రిసీప్ట్స్ రూ. 3557 కోట్లు. క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ. 3557 కోట్లు. ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా రాబడి 32 శాతం (రూ. 2000 కోట్లు) పెరిగింది. పట్టణ ప్రగతి/ 15 ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్స్ ద్వారా 13 శాతం (రూ. 834 కోట్లు). టౌన్ ప్లానింగ్ ద్వారా 28 శాతం (రూ. 1750 కోట్లు). బారోవింగ్ 20 శాతం (రూ. 1218 కోట్లు). ఇతర ఆదాయం 7 శాతం (రూ. 425 కోట్లు) రాబడి అంచనా వేయడం జరిగింది.
అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్
ఢిల్లీలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన భారత్ జోడో యాత్రను అపోలో ఆసుపత్రి సమీపంలో నిలిపివేశారు. అంబులెన్స్‌ని వెళ్లనివ్వడానికి కాసేపు ఆగాడు. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని తోటి యాత్రికులను కూడా కోరాడు. ఈ సంఘటన దేశ రాజధానిలోని అపోలో ఆసుపత్రి సమీపంలో జరిగింది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఉదయం హర్యానాలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్‌పూర్ బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఢిల్లీలోని 23 కిలోమీటర్ల మేర సాగి ఎర్రకోట దగ్గర ముగుస్తుంది. ఈ యాత్ర ఆశ్రమ్ చౌక్, నిజాముద్దీన్, ఇండియా గేట్, ఐటీవో, రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్ మీదుగా వెళుతుంది. ఎర్రకోటకు వెళ్లే ముందు ఆశ్రమ చౌక్ వద్ద రెండు గంటల విరామం తీసుకోనున్నారు. భారత్ జోడో యాత్ర ఇప్పటికే దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది.
నవరస నటనాసార్వభౌముడికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసం నుండి కైకాల అంతిమయాత్ర ప్రారంభమైంది.పార్థివ దేహాన్ని తీసుకెళుతున్న పూలరథం వెంబడి ఆయన అభిమానులు వాహనాలతో అనుసరించారు. అప్పటికే మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకాల.. శుక్రవారం మరణించారని తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నటులు చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు కైకాల పార్థివదేహానికి శుక్రవారం నివాళులు అర్పించారు. కైకాల సత్యనారాయణ పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ తండ్రికి తలకొరివి పెట్టారు.
సంధ్య థియేటర్లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’
బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహారెడ్డి. షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా సినిమాలోని ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే మూడో సాంగ్ ప్రోమో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పాటను డిసెంబర్ 24న విడుదల చేయనున్నది చిత్ర బృందం. ఇందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ వేదిక కానుంది. సెన్సేషల్ లాంచ్ ఫర్ ది స్పెషల్ సాంగ్ పేరుతో చేస్తున్న ఈవెంట్‌కు బాలయ్యతో పాటు హీరోయిన్ శృతిహాసన్ హాజరయ్యే అవకాశం ఉంది. సరికొత్త లుక్ లో అభిమానులను బాలయ్య సర్ ప్రైజ్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు. థమన్ సంగీతం, బాలయ్య డ్యాన్స్ తో సాంగ్ టీజర్ కే అభిమానులు ఊగిపోతున్నారు. మరి పూర్తి సాంగ్ వస్తే అభిమానులు ఏంచేస్తారో.. ఎంత రచ్చ చేస్తారో చూడాలి.
పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ హీరో..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా పీరియాడిక్ చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్రలో హిందీ హీరో బాబీ డియోల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే బాబీ డియోల్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చాడు షూటింగులో జాయిన్ అయ్యారు. ఇక హరి హర వీర మల్లు సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో మల్ల యోధుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఈచిత్ర కథ భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలం నేపథ్యంలో సాగుతుంది. అయితే.. ఈ చిత్రంలో మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నట్లు సమాచారం. క్రిష్ జాగర్లమూడి కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్లి బాబీ డియోల్‌కు కథ.. అందులో క్యారెక్టర్ గురించి వివరించారట.. ఆల్రెడీ హిందీలో క్రిష్ సినిమాలు చేసి ఉండటం.. ఆయన డైరెక్షన్ గురించి ఐడియా ఉండటం.. క్రిష్ చెప్పిన క్యారెక్టర్ బాబీకి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశారట. టాలీవుడ్ లో బాబీ డియోల్‌కు తొలి తెలుగు చిత్రమిది. ఇంతకు ముందు ఆయన చేసిన కొన్ని హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు కూడా తెలుగులో అనువాదం అయ్యాయి. అయితే.. ఇప్పుడు పవన్ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు బాబీ. తాజాగా సినిమాలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆసినిమా షూట్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇక ఇప్పుడు బాబీ డియోల్ షెడ్యూల్ కోసం సిటీలోని ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారు. బాబీకు వెల్కమ్ చెబుతూ కారు దిగిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండియన్ సినిమాలో బిగ్ యాక్షన్ స్టార్ అయిన బాబీ డియోల్‌తో పని చేస్తుండటం సంతోషంగా, ఎగ్జైటెడ్ గా ఉంది అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథా నాయిక కాగా..ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక, తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణ బాధ్యతలు జ్ఞానశేఖర్ నిర్వర్తిస్తున్నారు. సంభాషణలు సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు.