మన దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది..రాక్షస సంహారం అనంతరం విజయానికి గుర్తుగా విజయ దశమిని జరుపుకుంటారు..అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. ఈసారి శరన్నవరాత్రులు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 న ముగుస్తాయి..
ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు.. ఈరోజు రెండో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు.. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ దేవి అమ్మవారు. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్రం జపిస్తే చతుర్వేదాలు చదివిన ఫలితం కలుగుతుందట. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరలో దర్శనం ఇస్తారు. తామర పూవులతో అమ్మవారిని పూజించాలి. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎర్రటి గాజులు దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి తేజస్సు పెంపొందుతుంది..
మొదటి రోజు అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి.. ఇక రెండో రోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు..