Site icon NTV Telugu

సినీ, బుల్లితెర క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు

తెలుగు సినీ ప్రేక్షకులకు చిర పరిచితుడైన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గత రాత్రి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని పట్టుదల ఆయనలో కనిపించింది.

టాలీవుడ్‌లో 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో అడుగుపెట్టారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో రాజబాబు నటించారు. 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.

అంతేకాదు బుల్లితెర పై కూడా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి సీరియళ్ళలో ఆయన నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు గెలుచుకున్నారు. రాజబాబు ఆకస్మిక మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Exit mobile version