ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద. ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు. తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు. పదనిసలో పయనం సాగించాలనీ ప్రయత్నించారు. గిటారిస్ట్ గా పేరు సంపాదించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద కొంతకాలం శిష్యరికం కూడా చేశారు. తరువాత భానుచందర్ అనుకో్కుండా డ్రగ్స్ కు బానిసయ్యారు. దాని నుండి కోలుకోవడానికి అన్నట్టు నటనను ఆశ్రయించారు. నటనలో అడుగుపెట్టడం వల్ల పూర్తిగా నయమై, నటునిగా అలరించడం మొదలు పెట్టారు. బాపు ‘మనవూరి పాండవులు’లో ఐదుగురు పాండవుల్లో ఒకరిగా నటించిన భానుచందర్ తరువాత అనేక పాత్రలను పోషించారు. కొన్ని చిత్రాలలో విలన్ గానూ నటించారు. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ భానుచందర్ తండ్రి మాస్టర్ వేణు మంచి మిత్రులు. దాంతో వారిద్దరూ నటించిన ‘సత్యం-శివం’ చిత్రంలో విజయశాంతి ప్రేమికుని పాత్రలో భానుచందర్ ను నటింపచేశారు. భానుచందర్ ఫైట్స్ చూసిన తమ్మారెడ్డి భరద్వాజ తమ ‘ఇద్దరు కిలాడీలు’లో ఓ హీరోగా తీసుకున్నారు. అదే చిత్రంలో సుమన్ మరో హీరోగా నటించారు. తరువాతి రోజుల్లో భానుచందర్, సుమన్ కొన్ని చిత్రాలలో కలసి నటించి అలరించారు. భానుచందర్ సోలో హీరోగా రూపొందిన “టెర్రర్, భలేమిత్రులు, నిరీక్షణ, అలజడి, ఉదయం, లాయర్ సుహాసిని” వంటి చిత్రాలు అలరించాయి. తరువాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా, సంగీత దర్శకునిగానూ వ్యవహరించారు. అవేవీ అంతగా కలసి రాలేదు. దాంతో కేరెక్టర్ యాక్టర్ గా మారిపోయారు. అప్పటి నుంచీ గుణచిత్ర నటునిగా తనదైన బాణీ పలికిస్తున్నారు.
(మే 31న భానుచందర్ బర్త్ డే)