విలక్షణమైన పాత్రల్లో, వైవిధ్యమైన అభినయంతో ఆకట్టుకుంటూ సాగారు శరత్ బాబు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ శరత్ బాబు అభినయం అలరించింది. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో ఓ అతిథి పాత్రలో కనిపించారు శరత్ బాబు. వందలాది చిత్రాలలో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్న శరత్ బాబు, ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారు. ఈ జూలై 31తో శరత్ బాబు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.
శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. శరత్ బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది. తన తదనంతరం తనయుడు హోటల్ చూసుకుంటాడని భావించారు ఆ తండ్రి. అయితే శరత్ బాబుకు మాత్రం తాను పోలీస్ ఆఫీసర్ కావాలనే అభిలాష ఉండేది. కానీ, చదువుకొనే రోజుల్లో ‘షార్ట్ సైట్’ రావడంతో పోలీస్ ఉద్యోగానికి పనికి రానని తెలిసి పోయింది. అలాగే తండ్రి వ్యాపారం కూడా చూసుకోలేనని భావించారు. ఆ సమయంలో మిత్రులు, లెక్చరర్స్ ‘హీరోలా ఉంటావ్ … సినిమాల్లో ట్రై చేయరాదూ…’ అన్నారు. ఆ మాటలు శరత్ బాబు తల్లిని ఆకట్టుకున్నాయి. తండ్రి అంగీకరించక పోయినా, తల్లి ప్రోత్సాహంతో మద్రాసు చేరి, అవకాశాలవేట ప్రారంభించారు శరత్ బాబు. ఆ సమయంలో ‘రామవిజేత’ సంస్థ నూతననటీనటులు కావాలంటూ ఓ ప్రకటన వేసింది. దానిని పట్టుకు వెళ్ళిన శరత్ బాబుకు హీరోగానే అవకాశం లభించింది. అలా శరత్ తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘రామరాజ్యం’. ఆ సినిమాతోనే పేరు మార్చారు. అప్పటికే ఎంతో పేరున్న చంద్రకళ ఇందులో నాయిక. ఈ సినిమాలో శరత్ తో చంద్రకళపై చిత్రీకరించిన ‘ఏమండీ లేతబుగ్గల లాయరు గారూ…’ పాట అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
‘రామరాజ్యం’ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో శరత్ బాబు దొరికిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేశారు. ‘బంగారు మనిషి, అమెరికా అమ్మాయి, దొరలు-దొంగలు’ వంటి చిత్రాలలో నటించారు. అప్పటికే కమెడియన్ గా స్టార్ స్టేటస్ లో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారడం, తరువాత వారి పరిణయం కావడం జరిగిపోయాయి. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. పద్నాలుగేళ్ళ పాటు వారి కాపురం సవ్యంగా సాగింది. అప్పటికే శరత్ బాబు కూడా తెలుగు, తమిళ చిత్రాలలో బిజీ యాక్టర్ అయిపోయారు. కె.బాలచందర్ తెరకెక్కించిన ‘నిళల్ నిజమాగిరదు’ చిత్రంతో తమిళనాట శరత్ కు మంచి పేరు లభించింది. అదే సినిమాను తెలుగులో ‘ఇది కథకాదు’గా తెరకెక్కించగా, తెలుగులోనూ శరత్ నటించారు. ఈ సినిమాలతో శరత్ కేరెక్టర్ యాక్టర్ గా మంచి పేరు సంపాదించుకొని, సక్సెస్ రూటులో సాగిపోయారు. తరువాత రమాప్రభ, శరత్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తి విడిపోయారు. ప్రముఖ తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను పెళ్ళాడారు శరత్. ఆమెతోనూ విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు ప్రాణం పోయాలని తపిస్తూనే ఉన్నారు శరత్ బాబు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.