ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయనేత మురళీ మోహన్ ఈ రోజు 81 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశేషం ఏమంటే… అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య భార్య, ప్రముఖ నటి సమంత స్వయంగా మురళీ మోహన్ ను కలిసి, పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం దాగుంది. అదేమిటంటే… గచ్చిబౌలిలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో మురళీ మోహన్ నివాసం ఉంటున్నారు. ఆయన పక్క ఫ్లాట్ లోనే నాగచైతన్య, సమంత కాపురం ఉంటారు. సో… మురళీమోహన్ కు సమంత పక్కింటి అమ్మాయి! అందుకే సమంత ఆయన్ని స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ తెలియచేసింది.
ఇక అక్కినేని కుటుంబంతోనూ మురళీమోహన్ కు మంచి అనుబంధమే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన తొలి చిత్రం ‘కళ్యాణి’లో మురళీమోహనే హీరో. అలానే మురళీమోహన్ తన సొంత నిర్మాణ సంస్థ జయభేరి పతాకంపై అక్కినేని నాగార్జున హీరోగా ‘వారసుడు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ రకంగా అక్కినేని వారి కోడలు, సీనియర్ నటుడు మురళీమోహన్ కు శుభాకాంక్షలు తెలియచేయడం వెనుక ఈ అపూర్వ అనుబంధం దాగి ఉంది!