సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్
సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన రోజులను సమంత గుర్తు చేసుకుంది. మరీముఖ్యంగా పలు వివాదాల నడుమ విడుదలైన ఈ వెబ్ సీరిస్ గురించి వచ్చిన సమీక్షల పట్ల సమంత హర్షాన్ని వ్యక్తం చేసింది. రాజ్, డీకే తనను అప్రోచ్ అయినప్పుడు రాజి పత్ర్యేకపాత్ర అని, దానిని చాలా నెన్సిటివ్ గా, బాలెన్స్డ్ గా చేయాలని తాను గ్రహించానని తెలిపింది. అందులో భాగంగా క్రియేటివ్ టీమ్ కొన్ని డాక్యుమెంటరీస్, మరీముఖ్యంగా ఈలం పోరులో మహిళలు పడిన అగచాట్లకు సంబంధించిన వీడియోలు చూపించినప్పుడు తానెంతో కలత చెందానని, షాక్ కు గురయ్యానని సమంత చెప్పింది. అదే సమయంలో లక్షలాది మంది ప్రాణ త్యాగం చేసిన ఈ పోరాటానికి సంబంధించిన వీడియోలను కేవలం వేలమంది మాత్రమే చూడటం తాను గమనించానని తెలిపింది. మాతృదేశంలోనే ప్రాణాలను కోల్పోయిన వారు కొందరు కాగా, శరీరక, మానసిక గాయాలతో పరాయి ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్లు కొందరని చెప్పింది సమంత. తనవరకూ రాజీ పాత్ర ఓ ఊహాజనితమైనదే అయినా అసమాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధాకరమైన జ్ఞాపకాలతో ఇప్పటికీ జీవచ్ఛవాల్లా బతుకుతున్న వారికి ఇదో నివాళిగా తాను భావించానని సమంత చెప్పింది. రాజీ కథను తెరపై చూసిన వారు ద్వేషం, అసమానత, దురాశలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దత్తు నిస్తారనే ఆశాభావాన్ని సమంత వ్యక్తం చేసింది. ఒక వేళ మనం ఆ పనిచేయలేకపోతే… ఎంతో మంది తమ గుర్తింపును, స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అని సమంత తెలిపింది. మొత్తం మీద తన ముందుకొచ్చిన ఓ పాత్రను నటిగా అంగీకరించడమే కాకుండా లోతుపాతులను తెలుసుకుని, ఆ పాత్రకోసం ప్రాణం పెట్టిన సమంతను అభినందించాల్సిందే అంటున్నారు నెటిజన్లు.
సమంత రాజి పాత్ర ఎందుకు చేసిందంటే….
