Site icon NTV Telugu

గౌతమికి ‘అన్నీ మంచి శకునములే!’

ప్రముఖ దర్శకురాలు నందినీరెడ్డి ఎట్టకేలకు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఖాళీగా లేకుండా ఆహా కోసం ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని, ఓటీటీ కోసం ‘పిట్టకథలు’ ఆంథాలజీని చేసినా… ఈ యూత్ ఫుల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ మూవీని టేకప్ చేయడం సంతోషించదగ్గది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో ‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి మూవీ చేయబోతోందనే ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ అది ఇప్పుడు సెట్స్ పైకి వెళుతోంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించే ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ అనే పేరు కూడా పెట్టేశారు. అందులో నటిస్తున్న మిగిలిన నటీనటుల సంగతి ఏమో కానీ సీనియర్ నటి గౌతమికి మాత్రం ఈ సినిమాతో అన్నీ మంచి శకునాలే ఎదురవుతాయని పిస్తోంది.

గౌతమి జూలై 2న 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మూడు రోజులకే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఒకప్పుడు నాయికగా నటించిన గౌతమి ఇప్పడు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. కమల్ తో కలిసి ఉన్న సమయంలో ‘పాపనాశం’లో అతని భార్యగా నటించింది. ఆ తర్వాత సంవత్సరం తెలుగులో మోహన్ లాల్ సరసన ‘మనమంతా’లో చేసింది. ఈ సినిమా వచ్చి కూడా ఐదేళ్ళు గడిచిపోయింది. అయితే మధ్యలో తమిళ చిత్రం ‘తుప్పరివాలన్ -2’లో నటించడానికి అంగీకరించింది కానీ రకరకాల సమస్యల కారణంగా ఆ సినిమా పని వేగంగా సాగడం లేదు.

ఇప్పుడు తెలుగు సినిమా ‘అన్నీ మంచి శకునములే’ లో నటించడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామమే! ఎందుకంటే నందినీ రెడ్డి సినిమాలలో హీరోయిన్ల పాత్ర చాలా స్ట్రంగ్ గా ఉంటుంది. అంతేకాదు… హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రలను సైతం నందినీ రెడ్డి ఎంతో మనసు పెట్టి రాయిస్తారు. ‘అలా మొదలైంది’లో రోహిణి, ‘జబర్దస్త్‌’లో ప్రగతి, ‘కళ్యాణ వైభోగమే’లో రాశి, ‘ఓ బేబీ’లో లక్ష్మీ పాత్రలు అలాంటివే. ఇప్పుడు గౌతమి కోసం కూడా ‘అన్నీ మంచి శకునములే’లో అలాంటి పాత్ర రాయించారని తెలుస్తోంది. కమల్ హాసన్ కు దూరమైన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడటానికి గట్టి కృషి చేస్తోంది గౌతమి. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సదరన్ స్టేట్స్ రివైజింగ్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు. ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కు సేవ చేస్తున్నారు. ఈ సమయంలో నందినీరెడ్డి సినిమాలో మంచి పాత్రను పొందడం ద్వారా గౌతమి మరోసారి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరికినట్టే! ఆ రకంగా తెలుగులో మరింత బిజీ అయ్యే ఆస్కారం కూడా ఉంది!!

Exit mobile version