ఆనందం అంబరాన్ని అంటుతున్న సమయంలో హద్దులు ఆకాశాన్ని సైతం దాటుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏ మాత్రం అవకాశాలు చిక్కినా వదలొద్దు అంటూ మనసు ఆరాటపడుతుంది. ఇదే పరిస్థితిలో మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఉన్నారు. అసలే ప్రేమవివాహం. ఆపై మిత్రుల సమక్షంలో వివాహానంతర కార్యక్రమం. హద్దులుంటాయా చెప్పండి!
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ తమ పోస్ట్ వెడ్డింగ్ లో చేసిన హంగామా ఇప్పుడు వీడియో రూపాన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమ్మాయిగారు మౌనీరాయ్ బెంగాలీ భామ. అబ్బాయిగారు సూరజ్ నంబియార్ మళయాళీ బాబు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ పుడుతుందో, ఎలా చేరువవుతుందో, ఏ తీరున ఫలిస్తుందో ఎవరూ చెప్పలేరు. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ కహానీ సైతం అలాగే సాగింది. మొత్తానికి పెళ్ళితో ఒక్కటయ్యారు. ఓ వైపు బెంగాలీ సంప్రదాయంలో ఉత్సవం, మరోవైపు మళయాళీ వివాహ వేడుక పూర్తయ్యాక, వాటి కన్నా మిన్నగా తమ మిత్రులు, సన్నిహితులతో కలసి ‘పోస్ట్ వెడ్డింగ్ సెర్మనీ’ జరుపుకున్నారు మౌనీ, సూరజ్. ఇందులో విశేషమేముంది అంటారా? విశేషం లేకపోతే, ఈ ముచ్చట గురించి చర్చించుకోవలసిన పనేలేదు.
‘పోస్ట్ వెడ్డింగ్ సెర్మనీ’ సందర్భంగా మూడు అంతస్తుల ఓ భారీ కేక్ ను కట్ చేసే పనిలో పడ్డారు కొత్త దంపతులు. చుట్టూ సన్నిహితుల కోలాహలం, అయినా లెక్క చేయకుండా కేక్ కట్ చేస్తూనే ‘కిస్’ కొట్టేశారు. అదే సమయంలో అర్జున్ బిజ్లానీ చేస్తున్న హంగామా కూడా ఆకట్టుకుంది. నవదంపతుల ఈ ‘ముద్దు’ ముచ్చట ప్రస్తుతం ఇంటర్నెట్ లో భలే హంగామా చేస్తోంది. ఈ వేడుకలో దంపతులకు సన్నిహితులైన మందిరా బేడీ, ఆష్కా గోరడీ, మన్ మీత్ సింగ్, ఓంకార్ కపూర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ చూస్తుండగానే ‘ముద్దు ముచ్చట్ల’లో తేలిన ఈ నవవధూవరుల జీవనయాత్ర సుఖవంతంగా సాగాలనే అందరూ అభిలషిస్తున్నారు.