బాలీవుడ్ లో సౌత్ సినిమాల రీమేక్ జాతర నడుస్తోంది. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’ తాజాగా ముంబై బాట పట్టింది. రతీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ ఎంటర్టైనర్ హిందీలో అనీల్ కపూర్ లీడ్ రోల్ లో రీమేక్ కానుంది. సూరజ్ వెంజరమూడు, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో రూపొందిన ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్’ తెలుగు, తమిళ భాషల్లోకి కూడా తీసుకొచ్చే రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి…
‘ఫెయిత్ ఫిల్మ్స్’ అధినేత వికీ రజనీ హిందీ రీమేక్ రైట్స్ స్వంతం చేసుకోగా ఆయనతో బాటూ ‘సోనీ పిక్చర్స్’ సంస్థ కూడా అనీల్ కపూర్ స్టారర్ కు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుంది. ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ‘అండ్రాయిడ్ కుంజుప్పన్’ హిందీ వర్షన్ ఓ గ్రామీణ ప్రాంతంలోని వృద్ధుడి కథ. మలయాళంలో సూరజ్ వెంజరమూడు పోషించిన పాత్రలో అనీల్ కపూర్ కనిపించనున్నాడు.
‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్’లో ఓ కొడుకు తన తండ్రికి రోబోను గిఫ్ట్ గా ఇస్తాడు. తరువాత అతను రష్యాలో ఉద్యోగానికి వెళతాడు. అప్పుడు తండ్రికి నేస్తంగా మారిపోతుంది రోబో. అలా దానితో అనుబంధాన్ని పెంచుకున్న ఆయన జీవితంలో ఏం జరిగింది అన్నదే కామెడీ ఎంటర్టైనర్ ‘ఆండ్రాయిడ్ కుంజుప్పన్ వర్షన్ 5.25’! చూడాలి మరి, 2021లోనే… సెట్స్ మీదకు వెళ్లనున్న అనీల్ కపూర్ స్టారర్ రీమేక్ మూవీ 2022లో… ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ పొందుతుందో!