అన్నీ అనుకున్నట్టు జరిగితే… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హృతిక్ రోషన్, కరీనా కపూర్ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరి అభిమానులకు ఓ రకంగా ఇదో శుభవార్త. ‘కభీ ఖుషీ కభీ గమ్’ లాంటి సూపర్ హిట్ మూవీలో నటించిన ఈ సక్సెస్ ఫుల్ జోడీ చివరగా 2003లో ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’లో నటించారు. ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై జంటగా నటించే ఛాన్సే రాలేదు. అయితే ఓ ప్రముఖ దర్శకుడు ఇటీవల వీరిద్దరినీ కలిసి మూవీ చేయాలనే కోరికను వెలిబుచ్చాడట. ‘ఉలజ్’ పేరుతో తెరకెక్కబోయే ఈ సినిమాను జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
అతి త్వరలో ఆ దర్శకుడు కరీనా కపూర్ ను కలిసి స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వబోతున్నాడట. ఆమె ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక హృతిక్ కు కథ చెప్పడమే తరువాయి అంటున్నారు. అయితే వీరిద్దరూ ప్రాధమికంగా కలిసి నటించడానికైతే అంగీకారం తెలిపారన్నది సమాచారం. స్క్రిప్ట్ కూడా వీరికి నచ్చితే వెంటనే పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు వెళ్ళిపోతారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ముంబై వెలుపల షూటింగ్ చేస్తారట. ప్రస్తుతం దీపికాపదుకొనేతో కలిసి హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు. అలానే కరీనా కపూర్ ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో నటిస్తోంది. నిజంగానే హృతిక్, కరీనా కనుకగా ఈ కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేస్తే… బాలీవుడ్ లో ఇదో క్రేజీ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు.