కడపలో పుట్టి, చెన్నయ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు దేవ కట్టా. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ కోసం అమెరికా వెళ్ళాడు. యుక్తవయసు నుండి వెంటాడుతున్న ఫిల్మ్ మేకింగ్ పేషన్ ను అణచిపెట్టుకోలేక, అమెరికా నేపథ్యంలోనే 2005లో అక్కడి స్నేహితులు, నటుల సాయంతో ‘వెన్నెల’ మూవీని చేశారు. అది సిల్వర్ స్క్రీన్ పై దేవ కట్టా వేసిన తొలి అడుగు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ రెంటినీ సమపాళ్ళలో మేళవించడమే కాదు… స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ను రాసుకోవడం బేసికల్ గా రైటర్ అయిన దేవ కట్టాకు ఓ వరం. అందువల్లే ‘వెన్నెల’లోని రాజా, శర్వానంద్, కిశోర్, రవివర్మ పాత్రలు ఇప్పటికీ మన మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.
ఐదేళ్ళ తర్వాత దేవ కట్టా తీసిన ‘ప్రస్థానం’ చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ఓ టిపికల్ పొలిటికల్ డ్రామాను ఎంతో నేచురల్ గా, కన్వెన్సింగ్ గా తీసిన దేవ కట్టాకు ఫిదా అయిపోయింది. మరీ ముఖ్యంగా సాయికుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాల మీద బలమైన ముద్రను వేశాయి. ఈ సినిమా నంది అవార్డును అందుకోవడమే కాదు… ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అందుకే ఈ సినిమాను ఏరి కోరి సంజయ్ దత్ హిందీలో ‘ప్రస్థానం’ పేరుతోనే పునర్ నిర్మించారు, తానే నటించారు. ఈ మూవీతో దేవ కట్టా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇక్కడ ‘ప్రస్థానం’ తర్వాత దేవ కట్టా చేసిన ‘ఆటోనగర్ సూర్య’ మాత్రం ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించలేకపోయింది. అలానే తన కెరీర్ లోనే తొలిసారి దేవ కట్టా తమిళ సినిమా ‘అరిమ నంబు’ను తెలుగులో ‘డైనమేట్’గా రీమేక్ చేశారు. కానీ అదీ బాక్సాఫీస్ బరిలో పేలలేదు. అయినా దేవ కట్టాలోని ఫైర్ మాత్రం చల్లారలేదు. ఇప్పటికీ ఎన్టీయార్, రాజశేఖర్ రెడ్డి పాత్రలను ఫిక్షనల్ క్యారెక్టర్స్ గా చేసుకుని ఏదో వండర్ సృష్టించాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. సినిమా లేదా ఓ వెబ్ సీరిస్ ను వారిద్దరి పాత్రలతో చేయాలని ఆశ పడుతున్నారు.
ఇంతలో మరో సినిమా చేసే అవకాశం దేవ కట్టాకు లభించింది. అదే ‘రిపబ్లిక్’. భారతీయ రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, చట్టాలు, ప్రజల హక్కులు… వీటి నేపథ్యంలో ‘రిపబ్లిక్’ చిత్రాన్ని దేవ కట్టా తెరకెక్కించారు. సాయితేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన ఈ సినిమాను జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అందరిలో ఓ సరికొత్త చర్చకు తెర తీసింది. రేపు సినిమా ఇంకెంత చర్చనీయాంశం అవుతుందో చూడాలి.
దేవ కట్టా బర్త్ డే సందర్భంగా సోమవారం ‘రిపబ్లిక్’ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ‘రిపబ్లిక్’ పేరుతో మీరు తీసిన సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురుచూస్తున్నాను అంటూ హీరో సాయితేజ్ ట్వీట్ చేస్తే… ‘ఈ సినిమాలోని పాత్ర కోసం నిన్ను నువ్వు మలుచుకున్న తీరును ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడానికి నేనూ ఎంతో ఆసక్తితో ఉన్నాను’ అంటూ దేవ కట్టా బదులిచ్చారు. మొత్తం మీద దేవ కట్టా ఈసారి ఏదో గట్టిగానే పేల్చబోతున్నారు!
(మే 24 దర్శకుడు దేవ కట్ట పుట్టిన రోజు)