బిచ్చమెత్తని ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతో “ధర్మ యుగం” అనే సందేశాత్మక పాటను స్ఫూర్తి విజేత విద్యా సంస్థలు విడుదల చేశాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో “ధర్మ యుగం – హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పాటను ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఈ పాటను రూపొందించారు. సామాజిక బాధ్యతను చాటే ఈ ప్రయత్నం సమాజంలో అందరూ కలిసి పనిచేస్తేనే బెగ్గర్ ఫ్రీ సిటీ సాధ్యమని విజేత సంస్థల చైర్మన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాజిక సేవలో భాగంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులతో సత్కరించారు. అనాథలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఎన్జీఓలు, బిచ్చమెత్తకుండా నిరోధించేందుకు పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు, పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ఈ కార్యక్రమంలో సన్మానించారు.
విజేత పూర్వ విద్యార్థులు కలిసి బెగ్గర్ ఫ్రీ సొసైటీ కోసం సమాజంలో అవగాహన కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. సామాజిక బాధ్యతను ప్రతిబింబించే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోందని వారు అన్నారు. ఈ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన “ధర్మ యుగం” పాటను వందేమాతరం శ్రీనివాస్ సంగీతంతో అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుధీర్ వర్మ, నిర్మాత బీహెచ్.వీ. రామకృష్ణ రాజు, నటుడు నంద కిషోర్ పాల్గొన్నారు. ఈ పాట ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చి, బిచ్చమెత్తని సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు వేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
“ధర్మ యుగం” పాట ఒక సంగీత రూపంలో సామాజిక సందేశాన్ని అందిస్తూ, బెగ్గర్ ఫ్రీ సొసైటీ కోసం అందరినీ ఐక్యం చేసే ప్రయత్నంగా నిలిచింది.