పృధ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు నటుడే కాదు దర్శకుడు కూడా. అతను నటించిన తాజా చిత్రం ‘కోల్డ్ కేస్’ తొలిసారి థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైంది. సినిమాటోగ్రాఫర్ తను బాలక్ డైరెక్టర్ గా మొదటిసారి మెగాఫోన్ పట్టిన ఈ ఇన్వెస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే.. తిరువనంతపురం సమీపంలోని చెరువులో మనిషి పుర్రె ప్లాస్టిక్ కవర్ లో దొరుకుతుంది. మీడియా కారణంగా ఆ వార్త దావానలంలా వ్యాప్తిస్తుంది. హత్యకు గురైంది ఎవరు? కారణం ఏమిటీ? ఎవరు చంపారు? అనే విషయాలను తెలుసుకోవడానికి కేసును ఏసీపీ సత్యజిత్ (పృథ్వీరాజ్)కు అప్పగిస్తారు. మరో పక్క తాను పనిచేసే టీవీ ఛానెల్ కోసం పారా నార్మల్ కేసులకు సంబంధించిన కథనాలను ఇస్తుంటుంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మేథా పద్మజ (అదితి బాలన్). సింగిల్ మదర్ అయిన మేథ ఓ ఇంటికి అద్దెకు వెళుతుంది. అక్కడ ఉన్న పాత ఫ్రిజ్ కారణంగా ఆమె ఇరిటేట్ అవుతుంటుంది. ఆ ఇంటిలో అసాధారణ సంఘటనలు జరుగుతున్నాయని గ్రహించిన మేథ క్షుద్ర విద్యలు తెలిసిన జారా (సుచిత్ర పిళ్ళై)ను కలుస్తుంది. ఆమె ఆ ఇంటికి వచ్చి, అక్కడ ఇవా మారియా (ఆత్మీయ రాజన్) అనే యువతి ఆత్మ ఉందని చెబుతుంది. ఇంకో పక్క సత్యజిత్ తనకు అప్పటించిన మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కొన్ని ఆధారాలు సేకరిస్తాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పుర్రె ఓ అమ్మాయిదని, యేడాది క్రితం ఆమె హత్యకు గురైందని, చంపిన వ్యక్తి కూడా మహిళేనని తెలుస్తుంది. అతని ఇన్వెస్టిగేషన్ లోనూ హతురాలు ఇవా మారియా అనే తేలుతుంది. అసలు ఇవా మారియా ఎవరు? ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఒకే మిస్సింగ్ కేసును ఇటు పోలీసులు, అటు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పరిశోధిస్తున్న క్రమంలో ఎవరు దానిని ఛేదించారు? అనేది మిగతా కథ.
థ్రిల్లర్ జానర్ మూవస్ ఇటీవల కాలంలో మలయాళంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. చిన్న పాయింట్ ను తీసుకుని కథగా మలిచి, సినిమాగా తెరకెక్కిస్తున్నారు. రచయిత శ్రీనాథ్ వి నాథ్ కాగితం మీద కథను రాసుకున్నప్పుడు ఒకే కేసును రెండు రంగాలకు చెందిన వ్యక్తులు, రెండు రకాలుగా పరిశోధన చేయడం అనేది ఆసక్తి కరంగా అనిపించి ఉండొచ్చు. కానీ ఆ కేసుకు సంబంధించిన పరిశోధన విషయంలో రచయిత లోతుకు పోలేదని అనిపిస్తుంది. ఇటు పోలీస్ అధికారి అయిన సత్యజిత్, అటు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మేథ ఇద్దరూ కూడా పైపైన చేసే ప్రయత్నాలే మనకు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా చాలా విషయాలలో వాళ్ళ చర్యలకు జస్టిఫికేషన్ ఉండదు. ఉదాహరణకు ఓ పరిశోధనాత్మక పాత్రికేయురాలు తన బెడ్ రూమ్ లోకి అర్థరాత్రి నీళ్ళు వచ్చినప్పుడు అవి ఎక్కడ నుండి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. కానీ సింపుల్ గా పని మనిషిని ఈ నీళ్ళు తుడిచేయమని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. ఇది అంత సబబుగా అనిపించదు. ఇలాంటి లూప్ హోల్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో ప్రేక్షకులకు తగినంత ఉత్సుకత కల్గించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. మరీ ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశం, హత్యకు కారణంగా చూపించే సంఘటనలు ఏ మాత్రం బలంగా లేవు. ప్రేక్షకుల ఊహకు అందని ఓ వ్యక్తిని చివరి క్షణంలో లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు తప్పితే అందుకు కారణాలు కన్వెన్సింగ్ గా లేవు.
ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే… ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో మాజీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించిన పృథ్వీరాజ్… ఇందులో ఐపీఎస్ అధికారి పాత్ర చేశాడు. దాంతో ఆ బాడీలో స్టిఫ్ నెస్ అలానే కంటిన్యూ చేశాడు. కానీ కారణం ఏమైనా.. ఈ సినిమాలో మరీ స్లిమ్ గా కనిపించాడు. అతని నటన కంటే… లుక్ ఎక్కువ చర్చనీయాంశంగా మారేట్టుగా ఉంది. ఓ ఐపీఎస్ అధికారి టేకప్ చేసిన కేసు ఇన్వెస్టిగేషన్ మరింత ఆసక్తికరంగా ఉండాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ అది జరగలేదు. ‘ఆరువి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకున్న తమిళ నటి అదితి బాలన్ తొలి మలయాళ చిత్రమిది. మేథ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కానీ ఆమె క్యారెక్టరైజేషన్ మీద కూడా దర్శకుడు, రచయిత పెద్దంతగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. తన సొంత చెల్లి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా చాలా క్యాజువల్ గా చెప్పేస్తుంటుంది. ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఆమెకు పెద్దంతగా లేవన్నట్టుగా ఆ పాత్రను మలిచారు. విశేషం ఏమంటే అదితి బాలన్ ప్రస్తుతం తెలుగు సినిమా ‘శాకుంతలం’లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక తాజా చిత్రంలో కోల్డ్ కేసును సాల్వ్ చేసే విషయంలోనూ మేథ పాత్ర కంటే సత్యజిత్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అతను పాపులర్ హీరో కావడం ఓ కారణం కావచ్చు. లాయర్ హరితగా లక్ష్మీప్రియ చంద్రమౌళి, జారా గా సుచిత్ర పిళ్ళై చక్కని నటన కనబరిచారు. డీసీపీ మాలినీ అరవింద్ గా నీతా ప్రొమి నటన కూడా బాగుంది. ఆమె పాత్రను కూడా అనుమానించేలా దర్శకుడు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి, వీక్షకులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.
‘కోల్డ్ కేసు’ను ఆ మూవీలోని మెయిన్ టెక్నీషియన్స్ తీసిన చిత్రంగా భావించొచ్చు. ఈ మూవీ ఎడిటర్ షమీర్ మొహమ్మద్, సినిమాటోగ్రాఫర్ జోమొన్ టి జాన్ తో కలిసి ఆంటో జోసఫ్ దీనిని నిర్మించారు. అలానే జోమొన్ తో పాటు గిరీష్ గంగాధరన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే గిరీష్ కెమెరా పనితనం కారణంగా సినిమా మరో స్థాయికి చేరకుంది. అలానే ప్రకాశ్ అలెక్స్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. కానీ కొత్తదనం లేని సన్నివేశాలు, ఆసక్తి కలిగించని ద్వితీయార్థం వీక్షకులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. కథ, కథనాల విషయంలో దర్శకుడు తను బాలక్ మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. హారర్ థ్రిల్లర్ జానర్స్ ను ఇష్టపడేవారికి, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ కు ఇది నచ్చే సినిమా. కొత్తగా చెప్పుకోవడానికి, చూడటానికి ఏం లేదు కాబట్టి… మిగిలిన వారు స్కిప్ చేసినా ఫర్వాలేదు.
రేటింగ్ : 2.25 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న అంశం
నటీనటుల నటన
గిరీశ్ సినిమాటోగ్రఫీ
ప్రకాశ్ అలెక్స్ మ్యూజిక్
మైనెస్ పాయింట్
ఆసక్తి కలిగించని కథనం
బలహీనమైన క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: ‘ఓల్డ్’ కేస్!