NTV Telugu Site icon

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో అనుష్క శర్మ భారీ డీల్!

కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్‌ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

రాబోయే 18 మాసాలలో అనుష్కశర్మకు చెందిన క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థ ఎనిమిది ప్రాజెక్ట్స్ ను ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఇవ్వబోతోందట. కంటెంట్ విషయంలో పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటనను అనుష్క శర్మ సంస్థ వెల్లడించలేదు కానీ, ప్రస్తుతం ప్రముఖ లేడీ క్రికెటర్ ఝులన్ గోస్వామి మీద అనుష్క శర్మ ‘చక్దా ఎక్స్ ప్రెస్’ పేరుతో ఓ ఓటీటీ సినిమా తీసి నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వబోతోందని అంటున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ కూ తమ సంస్థతో అనుష్క శర్మ ఒప్పందం చేసుకుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. విశేషం ఏమంటే… ఇప్పటికే అనుష్క శర్మ నెట్ ఫ్లిక్స్ కు ‘బుల్బుల్’ చిత్రాన్ని, అమెజాన్ ప్రైమ్ కోసం ‘పాతాళ్ లోక్’ వెబ్ సీరిస్ ను చేసింది. మరి రాబోయే రోజుల్లో ఇంకే రకమైన కంటెంట్ ను అనుష్కశర్మ ఓటీటీ వీక్షకులకు అందిస్తుందో చూడాలి.