NTV Telugu Site icon

Allu Ramalingaiah: ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేయించిన అల్లు రామలింగయ్య వర్ధంతి స్పెషల్

తెలుగు చిత్రసీమ నవ్వులతోటలో వాడని పువ్వు అల్లు రామలింగయ్య. ఆయన పంచిన నవ్వులు ఈ నాటికీ సువాసనలు వెదజల్లుతూ కితకితలు పెడుతూనే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య అంతటి విజయం చూసిన హాస్యనటులు మరొకరు కానరారు. మూడు తరాలుగా అల్లువారి కుటుంబం సినిమారంగంలో అలరిస్తూనే ఉండడం మరో విశేషం! అల్లు రామలింగయ్య హాస్యంలో అల్లుకు పోయే గుణం ఉండేది. ‘అతి’ కనిపించినా, అదీ పాత్రకు అతికినట్టుగానే అనిపించేది. తనకు లభించిన ఏ పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి జనం పెదాలపై నవ్వులు నాట్యం చేసేలా చూసేవారు అల్లు. కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా నటించినా వాటిలోనూ నవ్వులే పూయించేవారు. అదీ అల్లువారి బాణీగా నిలచిపోయింది. తరువాతి రోజుల్లో ఎందరో హాస్యనటులు ఆయన బాటలోనే పయనించి, తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగునాట రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న హాస్యనటులుగా నిలచిపోయారు అల్లు. 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అల్లును ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తోనూ గౌరవించింది.

అల్లు రామలింగయ్య తెరపై కనిపిస్తే చాలు, నవ్వులు ఇట్టే పూసేవి. డాక్టర్ గరికపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా అల్లు రామలింగయ్య చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇదే చిత్రంతో జమున కూడా తెరకు పరిచయం కావడం విశేషం. ‘పరివర్తన, వద్దంటే డబ్బు, దొంగరాముడు, సంతానం, మిస్సమ్మ’ చిత్రాలతో అల్లు రామలింగయ్య మంచి గుర్తింపు సంపాదించారు. ‘మంచిమనసుకు మంచిరోజులు’లో ప్రతినాయకుని అనుచరునిగా నటించి మెప్పించారు. పెద్దా,చిన్నా అన్న తేడా లేకుండా ఎవరు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించేవారు రామలింగయ్య. పైగా ఆయనకు హోమియోపతి వైద్యంలోనూ మంచి ప్రవేశం ఉంది. దాంతో చిత్రసీమలోని వారికి తగిన వైద్యం చేస్తూ సాగేవారు. అందువల్ల అందరితోనూ ఇట్టే కలిసిపోయేవారు. అందరూ ఆయనంటే ఎంతగానో అభిమానించేవారు. ‘నాదీ ఆడజన్మే’ చిత్రంలో సావిత్రి, జమున అన్నయ్యగా కరుణరసమైన పాత్రలో అల్లు రామలింగయ్య ఆకట్టుకొనే అభినయం ప్రదర్శించారు. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో తప్పకుండా అల్లు రామలింగయ్యకు తగిన పాత్రలు ఉండేవి. అల్లు కూడా ఆ పాత్రల్లో తనదైన బాణీ పలికించేవారు. దాదాపు వెయ్యి చిత్రాలలో నటించి అలరించారు అల్లు రామలింగయ్య.

అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ కూడా కొన్ని చిత్రాలలో నటించారు. కానీ, తండ్రిలాగా ఆకట్టుకోలేక పోయారు. దాంతో నిర్మాతగా మారి గీతా ఆర్ట్స్ పతాకంపై జనం మెచ్చే చిత్రాలను అందించే స్థాయికి ఎదిగారు అరవింద్. ఇక అల్లువారి చిన్నకూతురు భర్త చిరంజీవి తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా జేజేలు అందుకున్నారు. అల్లువారి తనయుని కొడుకు అల్లు అర్జున్, కూతురు కొడుకు రామ్ చరణ్ సైతం తాతయ్య పేరు నిలుపుతూ కామెడీలో మంచి టైమింగ్ చూపిస్తూనే స్టార్ హీరోస్ గా రాణిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అల్లువారి కుటుంబం అల్లుకు పోయింది. ఆయన చిన్న మనవడు శిరీష్ సైతం హీరోగా నటిస్తున్నాడు. తెలుగు చిత్రసీమలో హాస్యం గురించిన చర్చ సాగిన ప్రతీసారి అల్లు రామలింగయ్య పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ నాటికీ బుల్లితెరపై కనిపించే ఆ నాటి అల్లువారి అభినయం చూసి జనం మురిసిపోతూనే ఉండడం విశేషం!