NTV Telugu Site icon

మరపురాని మధురం… ఆదినారాయణరావు సంగీతం

తెలుగు చిత్రసీమలో దర్శకత్వంతో పాటు సంగీతం సమకూర్చిన వారూ ఉన్నారు. ఇక నిర్మాణంతో కూడా స్వరాలు పలికించి రంజింప చేసిన వారు అరుదనే చెప్పాలి. వారిలో అగ్రస్థానంలో నిలుస్తారు పెనుపాత్రుని ఆదినారాయణ రావు. ఆదినారాయణరావు నిర్మాతగా మారకపోయి ఉంటే, మరింత మధురాతి మధురమైన సంగీతం మన సొంతమయ్యేదని సంగీతప్రియులు అంటారు. ఆయన బాణీల్లో అంతటి మహత్తుండేది మరి. తన భార్య నటి అంజలీదేవి పేరుమీద ‘అంజలీ పిక్చర్స్’ సంస్థనూ స్థాపించి మరపురాని చిత్రాలను నిర్మించారు ఆదినారాయణరావు.

ఆదినారాయణరావు 1914 ఆగస్టు 21న విజయవాడలో జన్మించారు. చిన్నతనంలోనే ‘సావిత్రి’ నాటకంలో నారదుని పాత్ర ధరించారు. తరువాత పట్రాయని నరసింహ శాస్త్రి వద్ద గాత్రం, హార్మోనియం లో శిక్షణ పొందారు. కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అనేక నాటక సంస్థలలో దర్శకునిగా, రచయితగా, సంగీత దర్శకునిగా పనిచేశారు. ఆయన వద్దే సంగీతశిక్షణ తీసుకున్న అంజలీదేవి చివరకు మాస్టారును తప్ప మరెవ్వరినీ పెళ్ళాడనని భీష్మించుకుంది. పైగా అప్పటికే ఆదినారాయణరావు గృహస్థు. జనం నివ్వెరపోయారు. అయినా చివరకు తథాస్తు అన్నారు. ఆ నాటి నుంచీ అంజలీఆదినారాయణరావుల చిత్రప్రయాణం సాగింది. తన భార్య నటించిన ‘గొల్లభామ’ చిత్రానికి శాస్త్రీయాన్ని, జానపదాన్నీ మేళవించి రాగయుక్తమైన బాణీలు కట్టారు. ఆ పై అంజలీదేవి నాయికగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ రచనలోనూ చేయి చేసుకున్నారు. ఆ చిత్ర దర్శకనిర్మాత బి.ఏ.సుబ్బారావుతో కలసి తాపీ ధర్మారావు కూడి కథను సమకూర్చారు. ఆంగ్ల నాటకకర్త రిచర్డ్ బ్రిన్ స్లే సెరిడాన్ రాసిన ‘పిజారో’ నాటకానికే కాసిన్ని మార్పులూ, చేర్పులూ చేసి ‘పల్లెటూరి పిల్ల’ను అందించారు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో “ధీర కంపన…” అంటూ సాగే పాటను కూడా ఆదినారాయణ రావే రచించడం మరో విశేషం. ఈ చిత్రానికి ఆదినారాయణరావు సంగీతం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.

ఆదినారాయణరావు, అంజలీదేవి దంపతులకు అక్కినేని నాగేశ్వరరావుతో మంచి అనుబంధం ఉండేది. వీరంతా కలసి ‘అశ్వినీ పిక్చర్స్’ పతాకాన్ని ప్రారంభించారు. ‘మాయలమారి’ తీశారు. అంజలీ పిక్చర్స్ పతాకంపై ఆదినారాయణరావు నిర్మించిన ‘పరదేశి’ ద్వారానే శివాజీగణేశన్ తెరకు పరిచయం కావడం విశేషం. తరువాత వరుసగా ‘అన్నదాత, అనార్కలి, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య, చండీప్రియ” వంటి చిత్రాలను నిర్మించారు ఆదినారాయణరావు. అలాగే చిన్ని బ్రదర్స్ పతాకంపైనా ‘అమ్మకోసం’ తెరకెక్కించారు. బాలీవుడ్ అందాలతారగా పేరొందిన రేఖ నాయికగా నటించిన తొలి చిత్రం ‘అమ్మకోసం’. ఆదినారాయణరావు నిర్మించిన చిత్రాల్లో ‘సువర్ణసుందరి’ అద్భుత విజయం సాధించింది! ఈ సినిమా రజతోత్సవాలు చూసింది. హిందీలో ఇదే పేరుతో పునర్నిర్మించారు. అందులోనూ అక్కినేని, అంజలీదేవి జంటగా నటించారు. ఏయన్నార్ నటించిన ఏకైక హిందీ చిత్రం ఇదే. హిందీలో ‘సువర్ణసుందరి’ మంచి విజయం సాధించింది. ఆ చిత్రంలోని ఆదినారాయణ రావు సంగీతం కూడా ఉత్తరాది వారిని విశేషంగా అలరించింది. ‘ఫూలోం కీ సేజ్’ చిత్రానికి కూడా ఆదినారాయణరావు స్వరకల్పన హిందీవారిని ఆకట్టుకొనేలా సాగింది. అనేక తమిళ చిత్రాలకు సైతం ఆదినారాయణ రావు సంగీతం మురిపించింది.

తొలి రోజుల్లో బయటి చిత్రాలకు కూడా సంగీతం అందించిన ఆదినారాయణరావు తరువాత తన సొంత చిత్రాలకే ఎక్కువగా స్వరకల్పన చేశారు. బయటి చిత్రాలలో తనకు నచ్చిన వారికి మాత్రమే సంగీతం అందించారు. ఆయన నిర్మించిన ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించారు. అందువల్ల వారితో ఉన్న అనుబంధం కారణంగా కృష్ణ నిర్మించిన “మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు” చిత్రాలకు సంగీతం సమకూర్చారు. కృష్ణంరాజు నిర్మించిన ‘భక్త కన్నప్ప’కు ఆరంభంలో కొన్ని బాణీలు కట్టారు. ఆ తరువాత ఆ చిత్రానికి ఆదినారాయణరావు శిష్యుడు సత్యం స్వరకల్పన చేశారు. తన సంగీతంలో శాస్త్రీయానికి పీట వేస్తూనే, జానపదాన్నీ మిళితం చేసేవారు. ఇక తెలుగునాట మన కర్ణాటక సంగీతంతో హిందుస్థానీనీ జోడించి బాణీలు కట్టిన తొలి తెలుగు సినిమా సంగీత దర్శకునిగా ఆయన నిలచిపోయారు. ఏది ఏమైనా ‘అనార్కలి’లోని “రాజశేఖరా… నీ పై మోజు తీరలేదురా…” పాటను విన్నప్పుడు, ‘సువర్ణసుందరి’లోని “పిలువకురా… అలుగకురా…” పాటను, “హాయి హాయిగా ఆమని సాగే…” పాటను వినగానే ఆదినారాయణరావు స్వరకల్పనలోని మహత్తేమిటో తెలిసిపోతుంది. అలాగే ‘స్వర్ణమంజరి’లోని “మధురమైన గురుదీవెన…మరపురాని ప్రియభావనా…” పాటలో ఆయన చేసిన విన్యాసాలు మరపురాని మధురం. ఇక ‘భక్త తుకారాం’లోని “ఘనాఘన సుందరా…” పాట పరవశింపచేయడమే కాదు, అందులోని మిగతా పాటలూ పరమానందం పంచుతాయి. జాతీయ పర్వదినాల్లో పలకరించే ‘అల్లూరి సీతారామరాజు’లోని “తెలుగువీర లేవరా…” పాట ఉరకలు వేయిస్తుంది. ఏది ఏమైనా ఎందరో సంగీతప్రియులను ఆదినారాయణరావు స్వరాలు ఈ నాటికీ పులకింప చేస్తూనే ఉన్నాయి.