అందం, అభినయం కలబోసుకున్న ఛార్మి కౌర్ కొన్ని సార్లు చిందులతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది ఛార్మి. ఈ మధ్యే “నా జీవితంలో పెళ్ళి అనే తప్పు చేయబోను…” అంటూ ఓ స్టేట్ మెంట్ పడేసి అందరినీ ఆశ్చర్య పరచింది. ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే నటనతో జనాన్ని మైమరపించింది ఛార్మి. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న ఛార్మి ఆపై కూడా కొన్ని చిత్రాలలో ముద్దు ముద్దుగా మురిపించింది. పూరి జగన్నాథ్ తో కలసి ప్రస్తుతం ఛార్మి నిర్మాతగా సాగుతోంది
భీమనేని శ్రీనివాసరావు నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నీ తోడు కావాలి’తో ఛార్మి నటిగా వెలుగు చూసింది. తరువాత హిందీ, తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లోనూ సాగింది. కానీ, నటిగా ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టినవి తెలుగు చిత్రాలే అని చెప్పాలి. కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’లో ఛార్మి అందం ఆ నాటి కుర్రకారుకు గంధం పూసింది. ‘మాస్’లో నాగార్జునతో మజాగా చిందేసింది. ‘అల్లరి పిడుగు’లో బాలకృష్ణతో తకధిమితై అంటూ ఆడింది. ‘లక్ష్మీ’లో వెంకటేశ్ తో పసందుగా సాగింది. టాప్ స్టార్స్ తో నటించి, విజయాలను చూసినా, వారి చిత్రాల్లో ఛార్మి సైడ్ హీరోయిన్ గానే వెలిగింది తప్ప, సోలో హీరోయిన్ గా మురిపించలేకపోయింది. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘చక్రం, రాఖీ’ చిత్రాలతోనూ నటిగా మంచి మార్కులు సంపాదించింది. ప్రభాస్ ‘పౌర్ణమి’లో ఛార్మి మరపురాని పాత్రనే ధరించింది. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మురిపించింది, ప్రత్యేక గీతాల్లోనూ అలరించింది. లేడీ ఓరియెంటెండ్ మూవీస్ “మంత్ర, మంగళ, అనుకోకుండా ఒక రోజు”లలో తనదైన బాణీ పలికించింది ఛార్మి. హిందీలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుడ్డా… హోగా తేరా బాప్’లో అమితాబ్ బచ్చన్ తోనూ నటించింది. కృష్ణవంశీ ‘చందమామ’లో కాజల్ కు ఛార్మి గాత్రం కూడా అందించింది.
ఛార్మి అందం మందమైనా, ఆమెలోని చలాకీ తనాన్ని ఇప్పటికీ ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మి’ లో వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకుంది ఛార్మి. ఈ సినిమాతోనే నిర్మాణభాగస్వామిగా తన రూటు మార్చింది. పూరి జగన్నాథ్ తో ఏర్పడిన పరిచయంతో ‘పూరి కనెక్ట్స్ ‘ బ్యానర్ లో ఛార్మి కూడా నిర్మాణభాగస్వామిగా కొనసాగుతోంది. ఈ బ్యానర్ తో మరికొందరు నిర్మాతలతోనూ కలసి చిత్రాలను నిర్మించింది. బాలకృష్ణ ‘పైసా వసూల్’, రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, పూరి తనయుడు ఆకాశ్ నటించిన ‘మెహబూబా’ చిత్రాల నిర్మాణంలో ఛార్మి భాగస్వామి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘లైగర్’ నిర్మాణంలోనూ ఛార్మి పాలు పంచుకుంది. భవిష్యత్ లో తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తానని అంటున్న ఛార్మి, మళ్ళీ ఎప్పుడు తెరపై తళుక్కుమంటుందో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!