‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు.
ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా, కృతీశెట్టి డాక్టర్ అలేఖ్య గా నటిస్తున్నారు. సినిమాలంటే ఏ మాత్రం ఆసక్తి లేని ఆమెని తన కథానాయికగా ఫిక్స్ అయిపోతాడు సుధీర్ బాబు. అందుకోసం ఆమెను ఎలా ఒప్పించాడనేది ఆసక్తికరంగా ఉంది. విశేషం ఏమంటే… కృతీశెట్టి రెండో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’లో ఆమె ఓ సైకాలజీ విద్యార్థిని. పై చదువుల మీద దృష్టి పెట్టిన ఆమెను షార్ట్ ఫిల్మ్ మేకర్ వాసు ఒప్పించి, నటిగా మారుస్తాడు. సో… ఇందులోనూ అదే తరహాలో ఆమె పాత్ర సాగుతుందనిపిస్తోంది. అయితే, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. దీనిని చూడగానే మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా? అనే ఆసక్తి కలగడం ఖాయం. పీజీ విందా కెమెరా పనితనం, వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాహి సురేష్ ఆర్ట్, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.