NTV Telugu Site icon

వేల కోట్ల‌లోనే బాలీవుడ్ కు న‌ష్టం!

గ‌త యేడాది కంటే ఈ సంవ‌త్స‌రం క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌టంతో వేలాది మంది థియేట‌ర్ల యాజ‌మాన్యం సొంత నిర్ణ‌యంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్క‌డి క‌క్క‌డ నిలిచిపోయాయి. విడుద‌ల అనే మాట కూడా ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత ప‌డే ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్ర‌సీమ వ‌సూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండ‌గా, గ‌త యేడాదిలో అది కేవ‌లం 50 కోట్ల‌కు ప‌డిపోయింది.

ఈ యేడాది రాబ‌డి సంగ‌తి ప‌క్క‌న పెడితే ఇంత వ‌ర‌కూ వ‌చ్చిన న‌ష్ట‌మే నాలుగు వేల కోట్లుగా ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. సినిమాల షూటింగ్స్ ఆగిపోవ‌డంతో పాటు, ముందు అనుకున్న తేదీకి సినిమాలు రిలీజ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో సంభ‌వించిన న‌ష్టం ఇద‌ట‌! గ‌త యేడాది థియేట‌ర్స్ ను ప్ర‌భుత్వాలే నిలిపివేస్తే, ఈసారి మాత్రం క‌రోనా తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌ల్ల‌డం బంద్ చేశారు. దాంతో అతి స‌హ‌జంగా వాటిని క్లోజ్ చేయాల్సి వ‌చ్చేసింది. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల యాజ‌మాన్యం మ‌రోసారి ఈ వ్యాపారానికి తిలోద‌కాలు ఇచ్చే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మే లో క‌రోనా పీక్స్ కు చేరుకుని జూన్ నుండి కాస్తంత నిదానించ‌వ‌చ్చున‌ని అంటున్నారు. అదే జ‌రిగితే.. ద్వితీయార్థంలో ప్రథ‌మార్ధం అంత న‌ష్టం క‌లుగ‌క‌పోవ‌చ్చు. ఏదేమైనా స‌ల్మాన్ ఖాన్ రాథే చిత్రం ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం కూడా ఇటు ఓటీటీ అటు థియేట‌ర్ల‌లో సైమ‌ల్టేనియ‌స్ గా మూవీస్ ను విడుద‌ల చేయాల‌ని అనుకున్న నిర్మాత‌ల‌ను డైల‌మాలో ప‌డేసిన‌ట్టు అయ్యింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.