YS Sharmila Shocking Comments On CM KCR: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ప్రసంగించిన ఆమె.. కేసీఆర్ ఒక గజ దొంగ అంటూ విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ చేస్తోంది మోసమేనని, తెలంగాణలో ఆయన చేతిలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఆయన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు షాద్‌నగర్‌కి ఎంతో చేశారన్నారు. వైఎస్సార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరా క్రాంతి గేదెల పథకం ఈ నియోజక వర్గం నుంచే ప్రారంభించారన్నారు. అంతేకాదు.. ఇంటర్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేయించడంతో పాటు మంచి నీటి సౌకర్యాలు, పార్కులు ఏర్పాటు చేయించారన్నారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ కేంద్రాన్ని ఈ నియోజక వర్గంలోనే వైఎస్సార్ ఏర్పాటు చేయించారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఇక్కడున్న మార్కెట్ యార్డ్‌కి వైఎస్సార్ వచ్చి, ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారన్నారు. షాద్ నగర్‌కి వైఎస్సార్ ఎంతో చేస్తే, కేసీఆర్ మాత్రం మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపణలు చేశారు.
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేస్తామని చెప్పి.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని మరి పూర్తి చేస్తానని చెప్పి, చేయలేదన్నారు. షాద్ నగర్ ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారన్నారు. 8 ఏళ్లయినా.. రిజర్వేషన్లను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. షాద్ నగర్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు.. మూడు కాయలు ఆరు పువ్వులు అన్నట్టు దందాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అంజయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్ అంటూ సెటైర్లు వేసిన షర్మిల.. ఆయన ఆగడాలకు ఒక వ్యక్తి సెల్ఫి వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఎమ్మెల్యే కాకముందు అప్పుల్లో ఉన్న అంజయ్య యాదవ్.. ఇప్పుడు వేల ఎకరాలు, వేలకోట్ల ఆస్తుల్ని సంపాదించారన్నారు. అగ్గువకు భూములు గుంజుకోవడం, ఎక్కువకు అమ్ముకోవడం మాత్రమే ఈ ఎమ్మెల్యే కొడుకులకు తెలుసన్నారు. ఈ తండ్రికొడుకుల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని, వారికి ఉసూరు తగలక మానదని శాపం పెట్టారు. షాద్ నగర్‌లో పరిశ్రమలు ఉన్నా, స్థానికులకు ఉద్యోగాలు లేవన్నారు. కనీసం డ్రైనేజీ సమస్యకు కూడా పరిష్కారం చూపలేక పోయారన్నారు. ఈ ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదు చేసినందుకు.. తనపై కేసులు పెట్టారన్నారు. వాళ్లు భూ కబ్జాలు చేస్తే తప్పు లేదు కానీ, తాను మాట్లాడితే మాత్రం తప్పు అంటున్నారన్నారు.
ఒక మంత్రి తనని మరదలు అంటే తప్పు లేదు గానీ, తాను ఎవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. స్పీకర్ కూడా అందుకు సానుకూలంగా స్పందించడం బాధాకరమన్నారు. తనపై కేసులు పెట్టి అసెంబ్లీకి పిలుస్తారన్నారని, తాను కాలినడకన రావడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. మీరు డేట్ ఇస్తారా? నన్ను డేట్ తీసుకోమంటారా? అంటూ ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ లోపలైనా, అసెంబ్లీ బయట అయినా తాను పబ్లిక్‌గా మాట్లాడుతానని.. ఏమడుగుతారో అడగండని సవాల్ విసిరారు. మీ అవినీతిచ అక్రమాలు, దౌర్జన్యాల గురించి మాట్లాడుతానన్నారు. తాను పులి బిడ్డనని, ఎవరికీ భయపడే రకం కాదని చెప్పారు. నిరంజన్ రెడ్డికి తల్లికి, చెల్లికి తేడా తెలియదని, మరదలంటే ఏ మహిళా అయినా చెప్పుతో కొడుతుందని మండిపడ్డారు. తాను నిరంజన్ రెడ్డిపై కేసు పెడితే పట్టించుకోలేదని, కానీ ఆయన ఫిర్యాదు చేస్తే మాత్రం తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆగ్రహించారు. ఎలాగూ తన మీద కేసు పెట్టారు కాబట్టి.. తనని అరెస్ట్ చేయాల్సిందిగా తాను కేసీఆర్‌కి సవాల్ విసురుతున్నానని అన్నారు. తాను వైఎస్సార్ బిడ్డనని, మీ కేసులకు, బెదిరింపులకు భయపడనని తెగేసి చెప్పారు. తాను ప్రజల పక్షాణ నిలబడి, సేవ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
ప్రజలు తనకు అవకాశం ఇచ్చిన రోజు.. నమ్మకంగా ముఖ్యమంత్రి స్థాయిలో సేవ చేస్తానని షర్మిల పేర్కొన్నారు. అవకాశం ఇచ్చేదాకా ప్రజల కోసమే పోరాటం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి బిడ్డ అయిన తనే ఫిర్యాదే పట్టించుకోలేదంటే, ఇక సాధారణ మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీస్‌లను కేసీఆర్ తన పనోళ్లుగా మార్చుకున్నారన్నారు. బీజేపీకి RSS ఎలాగో.. కేసీఆర్‌కి ఈ పోలీసులు అలా తయారయ్యారన్నారు. ఈ పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్యం మంత్రి అని, మద్యం అమ్మకాలు పెరిగి మహిళలపై దాడులు పెరుగుతుంటే చర్యలు తీసుకోవడం లేదన్నారు. దక్షిణ భారత్‌లో మహిళలపై రేపులు జరగడంలో తెలంగాణ నం.1 ప్లేస్‌లో ఉందన్నారు. వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పేర్కొన్న షర్మిల.. తాను అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్సార్ అమలు చేసిన ప్రతీ పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
