Site icon NTV Telugu

YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేస్తా..

YS Sharmila

YS Sharmila

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా తనకే ఉందన్నారు. ఇతర వ్యక్తికి.. ఇతర పార్టీకి ఆ హక్కులేదన్నారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం మన ఆస్తి అన్నారు షర్మిల.

ఖమ్మం జిల్లా అంటే వైఎస్సార్ జిల్లా అని.. ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజకవర్గమన్నారు. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదని.. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందని వెల్లడించారు. ముఖ్యంగా వినిపిస్తున్న స్వరం పాలేరు నుంచి పోటీ చేయాలని… అడుగడుగునా హారతులు పట్టుకుంటూ ప్రతి గ్రామంలో అందరూ చెప్తున్నారని స్పష్టం చేశారు. పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు కాబట్టి దేవుడు తధాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకమన్నారు. ఇవ్వాళ్టి నుంచి పాలేరులో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు… నా కోరిక కూడా అని పేర్కొన్నారు. వైఎస్సార్ పార్టీ పతాకం పాలేరు గడ్డ పై ఎగరాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. అత్యధిక మెజారిటీ కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు అని.. ఇక్కడి ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతానని ఆమె అన్నారు.

“వైఎస్సార్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదకు తేవాలి. ఏ కార్యక్రమం చేపట్టినా పాలేరు పుట్టిన ఇల్లు. పాలేరు నియోజక వర్గం ఒక దిశానిర్దేశం అవ్వాలి. ముందు వరసలో పాలేరు ఉండాలి. పార్టీ అభివృద్ధిలో ఎక్కడ లేనంత ముందు వరసలో ఉండాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి. ప్రజలకు మీరు ఉన్నారన్న భరోసా కల్పించాలి. షర్మిలమ్మ మన నియోజక వర్గం అని చెప్పాలి. మీరు ముందు ఉండాలి ..అందరికీ ఆదర్శం అవ్వాలి” అని వైఎస్సార్‌టీపీ కార్యకర్తలకు షర్మిల సూచించారు.

Governor: దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్య అనేది ఎంతో అవసరం

Exit mobile version