Site icon NTV Telugu

Hyderabad: పరేడ్‌గ్రౌండ్‌ లో యోగా డే వేడుకలు.. పాల్గొన్న ఉపరాష్ట్రపతి

Vnkayya Naidu

Vnkayya Naidu

ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 21న ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్‌ను ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ నగరంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా గురించి మాట్లాడారు. యోగా వల్ల యూనిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యం వస్తుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత జనరేషన్ కూడా యోగాను చెయ్యాలని తెలిపారు. యోగా చేయడం వల్ల ఆత్మశక్తిని ఏకం చేయవచ్చని, యోగ అంటే ఇంద్రియాలని ఏకం చేయడం అని వెంకయ్య నాయుడు తెలిపారు. యోగా ప్రాచీనమైనదే అయినప్పటికీ దానికి ఎటువంటి కాలదోషం లేదని, అన్ని కాలాలలోనూ యోగాను చేయవచ్చని పేర్కొన్నారు. యోగాకు కులం, మతం వంటి ఎటువంటి హద్దులు లేవని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రసిద్ధం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, యోగా ని కనుగొన్న మన పూర్వీకులకూ వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్యవంతం చేద్దామని, యోగసాధనతో ప్రపంచ శాంతి చేకూరుతుందని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. యోగా స్ట్రెస్ ను, టెన్షన్ ను పోగొడుతుందని పేర్కొన్న వెంకయ్య నాయుడు ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో యోగా మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా.. భారత ఉపరాష్ట్రపతి తో పాటు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేషు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బిజెపి నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తప్పనిసరిగా చేయాలని సూచించారు. యోగాను అందరూ అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్న మంత్రి కిషన్ రెడ్డి, పాఠశాలల్లో యోగా ను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ఉత్తమమని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version