Site icon NTV Telugu

Y.S. Sharmila: టీఆర్ఎస్ తాగుబోతులు, రేపిస్టుల పార్టీ

Ys Sharmila

Ys Sharmila

ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు.

కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో మంచి నీళ్లు కూడా దిక్కలేవని.. బడులు, గుడులు ఎన్ని ఉన్నాయో బార్లు, వైన్స్ కూడా అన్నే ఉన్నాయని ఆరోపించారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ మద్యం వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం రాబడితో రాష్ట్రాన్ని నడుపుతున్నాడని.. బాలికలకు కేసీఆర్ పాలనలో రక్షణ లేదని విమర్శించారు. బాలికలపై అత్యాచారాలు చేస్తుంది టీఆర్ఎస్ నేతల కొడుకులు, మనవళ్లు అంటూ ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ హత్యాచారాలు, తాగుబోతులు, రేపిస్టుల పార్టీ అని విమర్శించారు.

రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే సీఎం గాడిదలను కాస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు లేవని అడిగారు. ప్రభుత్వం మనదే ఇష్టం వచ్చినట్లు చేసుకోండని సీఎం ధైర్య ఇస్తున్నారని.. పనికోసం, సహాయం కోసం వెళ్తే ఆడవాళ్ల మాన ప్రాణాలను అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. మన దరిద్రం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. ఆయన పాలనలో పేదలకు గౌరవం లేదని ఆరోపించారు. ఈ దరిద్రం సరిపోదు అన్నట్లుగా దేశాన్ని ఏలుతాడా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబమే బాగుపడిందని విమర్శించారు.

కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేని తెలంగాణగా మార్చాడని విమర్శించారు. రూ.800 కోట్లు టీఆర్ఎస్ అకౌంట్లో ఉంటే బంగారు తెలంగాణ ఎవరికి అయిందని ప్రశ్నించారు. దొంగోడికి తాళం ఇస్తే మొత్తం దోచుకుపోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. 16 వేల కోట్లు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని..కమీషన్ల రూపంలో తెచ్చిన అప్పులు కేసీఆర్ ఇంట్లోకి పోయాయని ఆరోపించారు. మాట ఇచ్చి మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డ గా చెప్తున్న.. వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ ను తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇక నమ్మింది, మోసపోయింది చాలని ఆమె ప్రజలకు సూచించారు.

Exit mobile version