ఓ గ్రామ మహిళ సర్పంచ్ మరో మహిళను భూ తగాదాలో బూతులు తిడుతూ దాడిచేయడం మహబూబాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. జిల్లాలోని మరిపెడ మండలం జెండాల తండాలో మహిళా సర్పంచ్ భూ తగాదాలతో మరో మహిళ విజయపై తన అనుచరులతో కలిసి దాడిచేసింది. మహిళా సర్పంచ్ భూ సంబంధిత విషయంలో విజయ అనే మహిళను తీవ్ర పదజాలంతో దూషిస్తూ, చెప్పు చూపిస్తూ దాడిచేయడంతో గ్రామస్తులు ఆ మహిళ సర్పంచ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామ ప్రధమ పౌరురాలై ఉండి, అధికారం అడ్డుపెట్టుకొని మహిళపై దాడి చేయడం అన్యాయమని, రౌడియిజం చేస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇట్టి దాడి విషయంలో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.