తెలంగాణ కేబినేట్ భేటిలో వరి ధాన్యం అంశంపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంప్రభుత్వం రాష్ర్ట బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందో చెప్పాలన్నారు. బీజేపీ హయాంలో రెండేళ్లలో భయంకరంగా పేదరికం పెరిగింది. రైతులు బాగుపడాలంటే బీజేపీని పారద్రోలాలని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి బోర్‌ల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తుంది. బీజేపీ పాలన కంటే కోటి రెట్లు తెలంగాణకు మంచి పాలన అందిస్తున్నామన్నారు. కిషన్‌రెడ్డి, పీయూష్ గోయల్ ఇవాళ సిగ్గుపడాలి. కరెంట్ మీద పెత్తనం అంతా కేంద్రం తీసుకుంటుందటా ఇదేక్కడి కథ అంటూ కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
హంగర్ ఇండెక్స్‌లో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే దారుణంగా భారత్ పరిస్థితి ఉంది. కేంద్రం చేతులేత్తేసింది కాబట్టి వేసవిలో రైతు కొనుగోలు కేంద్రాలు ఉండవు. ధాన్యం ఎంత కొంటారో చెప్పకుండా హుజురాబాద్, దుబ్బాక అంటూ బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. రాష్ర్టం ఇప్పటికే పదివేల కోట్లు నష్టపోయింది. బీజేపీ దివాళ కోరు రాజకీయాలకు తెర తీసిందని ఇదో దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు. పాలసీలు మార్చుకుని రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారన్నారు.
బీజేపీ వాట్సాప్ యూనివర్సీటీలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ దేశాన్ని అప్పుల పాలు చేసి, రైతులను మోసం చేస్తుందన్నారు. కిషన్‌రెడ్డి బహిరంగ చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. బీజేపీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంది.15 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఒక్కటైనా ఉందా ఎక్కడ ఉంది బీజేపీ అని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకుని, తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ పై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు.
