Site icon NTV Telugu

Warangal: వరంగల్ పోలీసుల హెచ్చరిక.. బర్త్‌డే సెలబ్రేషన్స్ అలా చేస్తే జైలుకే..!

Warangal Police

Warangal Police

Warangal: బహిరంగంగా తల్వార్ (కత్తులు) ప్రదర్శించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న తల్వార్ లు, కత్తుల సంస్కృతిపై దృష్టి సారించారు సీపీ. కొందరు వ్యక్తులు తల్వార్ లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇకపై ఎవరైనా పుట్టినరోజు వేడుకలు లేదా ఇతర కార్యక్రమాలలో బహిరంగంగా తల్వార్‌లను ప్రదర్శించి, వాటిని ఊపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యంగా జన్మదిన వేడుకల సందర్భంగా కూడళ్లలో తల్వార్‌లు, కత్తులతో కేక్‌లు కటింగ్‌ చేస్తున్న ఫొటోలతో కూడిన ప్లెక్సీలు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు. ప్రధాన రహదారులపై యువకులు ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తల్వార్‌లు చూపినా, ఊపినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు, ఫొటోలు పెట్టినా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read also: Fake Baba: పాతబస్తీలో దారుణం.. నవ వధువుపై నకిలీ బాబా అత్యాచారం

మద్యం మత్తులో మధు వ్యక్తి తల్వార్‌ తో షాప్‌ లో వెళ్లి హల్‌ చల్‌ చేసిన ఘటన వరంగల్‌ జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో మధు అనేవ్యక్తి అఖిలబార్ కి వెళ్ళాడు. ఫుల్‌ గా మందు తాగాడు. ఇంకా కావాలని డిమాండ్ చేశాడు. అయితే బార్ క్యాషియర్ ముందు ఇప్పటి వరకు తాగిన దానికి డబ్బులు కట్టాలని అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మధు బయటకు వెళ్లాడు. తమ వెంట తల్వార్ తెచ్చి ఫుల్ బాటిల్ కావాలని బెదిరించాడు. భయాందోళనకు గురైన బార్ షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బార్ వద్దకు చేరుకున్న పోలీసులకు మధు చుక్కలు చూపించాడు. ఫుల్ బాటిల్ ఇస్తేనే వస్తానంటూ మెండికేశాడు. దీంతో విసుగు చెందిన పోలీసులు మధుని మాటల్లో ఉంచి అదుపులోకి తీసుకున్నారు. మధు గతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ఇదివరకే మదుపై రౌడీ షీట్ కేసు నమోదైందని అన్నారు. మద్యం మత్తులో పుల్ బాటిల్ కావాలని డిమాండ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడని అన్నారు. సిబ్బంది డబ్బులు అడగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయి కొద్దిసేపటి తర్వాత తల్వార్ తో వచ్చి క్యాషియర్ చంపుతానని బెదిరించాడని అన్నారు. క్యాషియర్ రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Sagileti Katha: ‘అట్టా ఎట్టాగా పుట్టేసినావు’ అంటున్న రవితేజ మహాదాస్యం

Exit mobile version