Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా

Vivek Venkataswamy

Vivek Venkataswamy

Vivek Venkataswamy: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీలో రూ.50 లక్షల నిధులతో రెండు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు 22ఏ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22ఏ భూముల సమస్యపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని వివేక్ తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో 22ఏ జాబితాలో భూములు చేరిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. తన భూమిని 22ఏలో చేర్చారంటూ ఇప్పటివరకు ఎవరూ తనను సంప్రదించలేదని చెప్పారు. సమస్య ఉన్న వారు తనను కలిస్తే.. వారిని రెవెన్యూ మంత్రి వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో చెన్నూరులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండేదని మంత్రి పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలేదని, ఎన్నికల సమయంలో కేవలం శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు కూడా గత ప్రభుత్వం నిధులు చెల్లించలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెన్నూరు రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నానని వివేక్ తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్నారని చెప్పారు. రోడ్డు విస్తరణ కారణంగా ఉపాధి కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా షాపులు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి పథకంలో భాగంగా రూ.30 కోట్లతో పనులు జరుగుతున్నాయని, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భవనాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. వచ్చే ఏడాది పుష్కరాల సందర్భంగా సుమారు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. చెన్నూరు పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. బీజేపీ నేతలు ఇటీవల తప్పుడు ఆందోళనలు చేశారని మంత్రి విమర్శించారు. చెన్నూరులో ప్రజాపాలన కొనసాగుతుంటే.. బీజేపీ బుల్డోజర్ పాలనను కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గోదావరికి వెళ్లే మార్గంలో 10వ వార్డులో రోడ్డు విస్తరణ కోసం రూ.6 కోట్లు మంజూరు చేయనున్నట్లు వివేక్ తెలిపారు. పట్టణంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించామని, చెన్నూరును టూరిస్ట్ సెంటర్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.17 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జోడువాగుల వద్ద అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణ ఫాలోఅప్‌తో రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. చెన్నూరు డిపో ఏర్పాటు ప్రజల చిరకాల కోరిక అని పేర్కొన్న వివేక్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ పనులు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయని వెల్లడించారు. అలాగే 100 పడకల ఆసుపత్రి భవనాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చెన్నూరుకు 23 మంది వైద్యులు వచ్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.