మనదేశం వివిధ పండుగలు, వేడుకలు, సంప్రదాయాలు, ఆటలకు వేదిక. హోళీ పండగ అందరికీ రంగుల పండగ. కులమతాలకు అతీతంగా అందరూ కలసి రంగులు జల్లుకుని ఆనందంగా జరుపుకునే పండగ. కానీ అక్కడ హోళీ అంటే పిడిగుద్దులకు ప్రత్యేకం. జనం రెండు వర్గాలుగా విడిపోయి కొద్దిసేపు పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఆతరువాత అందరూ ఆనందంగా అలయ్ బలయ్ చేసుకుంటారు. రంగులు జల్లుకొమ్మంటే పిడిగుద్దులు ఎందుకు అని అంటే అది తరతరాలుగా వస్తున్న మా సాంప్రదాయం అని చెబుతున్నారు వారు. కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం… ఈపిడిగుద్దుల ఆట జరుపుకొకపోతే అరిష్టం అంటూ హోళీ కోసం పిడిగుద్దులను ప్రాక్టీస్ చేస్తున్నా నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామస్తులు.
అంతా ఒకచోట గుమిగూడి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటున్న ఈ సీన్ చూస్తే మాత్రం అంతా కలిసి గొడవపడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అది సాంప్రదాయం, వందల ఏళ్ళ నుండి వస్తున్న ఆచారం. హోళీ పండగరోజు ఉదయం పండగ జరుపుకుని ఆతరువాత కుస్తీ పోటీలు నిర్వహించి సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. హోళీ సందర్భంగా గ్రామం సుభిక్షంగా ఉండటం కోసం జరపుకునే ఉత్సవం…గ్రామస్తులంతా ఓ చోటికి చేరి ముక్కూ, మొఖం వాచేలా గుద్దుకుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సాలో ఈవింత అచారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈవిషయం తెలిసిన వారు మాత్రం ఔరౌరా.. ఇదేం పండుగరా బాబూ అంటున్నారు. ఈ పిడిగుద్దుల సాంప్రదాయాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్తులు పిడిగుద్దులు ప్రాక్టీస్ చేస్తున్నారు.
ముఖంపై పవర్ పంచ్ లేసుకుంటారు. కానీ ఎదుటి వారిని కోపంతోనో లేక శత్రుత్వంతోనో అస్సలు కొట్టరు.ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా ఒకరినొకరు ముఖంపై పిడిగుద్దులు గుద్దుకుంటారు. గాయపడిన వారు కామదహనం చేసిన బూడిదను గాయంపై రాసుకుంటారు. ఆబూడిదను రాసుకుంటే గాయం మానిపోతుందని వారి నమ్మకం. మిగతా ఆటల మాదిరిగానే ఈ ఆటకు కొన్ని నియమాలున్నాయి. గ్రామ నడిబొడ్డులో రెండు గుంజలకు తాడు కడతారు. ఆ తాడును ఓ చేత్తో పట్టుకొని మరో చేత్తో ముఖంపై మాత్రమే పిడిగుద్దులు గుద్దాలి. ఆట ఆరంభానికి ముందు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు జరిపి కులాల వారిగా ఇరువైపుల నిల్చుంటారు. గ్రామ పెద్ద ఈల వేసిన వెంటనే ఒకరినొకరు రక్తం కారేంత వరకు కొట్టుకుంటారు. మళ్లీ ఈల వేయగానే అందరూ ఆగిపోతారు. ఇదంతా ఓ క్రమశిక్షణగా సాగుతుంది. ఒకరిని టార్గెట్ చేసి కొట్టే పరిస్థితి ఇక్కడ ఉండదు. గాయపడ్డ వ్యక్తిని తోటి వారు తమ భుజాలపై మోసుకెళ్లి కామదహనం చేసిన బూడిదను రాస్తారు. ఆతర్వాత ఆ వ్యక్తి నుంచి బహుమతిగా కొన్ని డబ్బులను తీసుకుంటారు. ఆట పూర్తయిన తర్వాత అందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటారు.
ఎవరు కనిపించినా పిడిగుద్దులాటే..
తరతరాలుగా సాగుతున్న ఈ ఆచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాల్సిందేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక వేళ దీన్ని కొనసాగించని పక్షంలో గ్రామానికే అరిష్టమని వారి నమ్మకం. గతంలో ఓ సారి పోలీసుల ఒత్తిడితో ఈ ఆటను ఆడకపోవడంతో గ్రామానికి కీడు జరిగిందని గ్రామస్తుల చెబుతున్నారు. హింసతో కూడుకున్న ఆట కాబట్టి పోలీసులు వీటిపై ఆక్షలు విధించారు. కొద్ది సేపు మాత్రమే కొనసాగించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామపెద్దలే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించారు. పిడిగుద్దులాటకు పోలీసుల పర్మిషన్ లేకున్నా వారు ఆడితీరతారు. భలేగా వుంది కదూ ఈ పిడిగుద్దులాట.