Vijayashanti Revealed KCR BBC Policy At The Elections: మునుగోడులో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ కేసీఆర్ BBC (బీబీసీ)ని తీసుకొస్తారన్నారు. బీబీసీ అంటే.. బ్రాండీ, బిర్యానీ, కరెన్సీ అని ఆమె వివరించారు. ఆ బీబీసీని కేసీఆర్ ఎరగా వేసి, ఎన్నికల్లో గెలిచి వెళ్తిపోతాడన్నారు. ఈసారి వాటికి లొంగొద్దని, కేసీఆర్‌కు బుద్ధి చెప్పండని ఆమె ప్రజల్ని కోరారు. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందని, ఆ భయంతోనే బీజేపీని ముక్కలుముక్కలు చేద్దామని ఆయన అనుకుంటున్నాడని, కానీ బీజేపీని ఎవరూ ముక్కలు చేయలేరని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తమ అంది ఏకైక లక్ష్యమన్నారు.
దిమాక్ ఉన్నోళ్లెవరూ కేసీఆర్‌కు సపోర్ట్ చేయరని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడుతానని కేసీఆర్ అంటున్నారని, మరి ఈ ఎనిమిదేళ్ల పాలనలో ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం మొత్తాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీ శత్రువు కావొచ్చేమో గానీ, ప్రజలకు మాత్రం ఆయన నమ్మదగిన మిత్రుడని ఆమె వ్యాఖ్యానించారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, ఆ హామీని పక్కన పడేశారన్నారు. తెలంగాణ అమరవీరుల కలలను తుంగలో తొక్కేశారని, గిరిజనులకు భూమి ఇస్తానని మోసం చేశారని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యత లేని అన్నం పెడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్‌గా మిగిల్చి.. వేల కోట్ల డబ్బుల్ని జేబులు వేసుకున్నారని ఆరోపించారు. ఇన్ని తప్పులు చేస్తున్న కేసీఆర్‌ను.. ప్రజలు సమర్థించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
భయం లేనప్పుడు.. పదే పదే సీబీఐ, ఈడీని ఎందుకు కలవరిస్తున్నావంటూ కేసీఆర్‌ని విజయశాంతి ప్రశ్నించారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని, కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని ఆమె పేర్కొంది. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఇక బీజేపీ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, ఇందుకుగానూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని విజయశాంతి అన్నారు. మునుగోడులో ఆయన గెలిచిన తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.