VP Elections: డిల్లీ – భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 ఎన్నిక జరగనుంది. ఎన్డిఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజారిటీ మెంబర్లు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. కానీ ఏ కూటమి అయినా అందులో ఉన్న వాళ్లంతా కచ్చితంగా ఒకవైపే వేయాలని రూల్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు విప్ ఉండదు
భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మరికొన్ని ఎన్నికలకు విప్ వర్తించదు. దేశంలో విప్ ఉండని ఎన్నికలు అంటే , ఓటర్లుగా ఉండే వాళ్ళు తమ పార్టీ ఆదేశానికి కట్టుబడి కాకుండా, తమ స్వతంత్రత తో ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నికలు. సాధారణంగా లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులపై లేదా తీర్మానాలపై ఓటింగ్ సమయంలో పార్టీలు విప్ జారీ చేస్తుంటాయి.. అప్పుడప్పుడు ఎవరికి ఓటు వేయాలో పార్టీ సభ్యులకు చెప్తారు కూడా, పార్టీ విప్ ద్వారా ఆదేశాలు జారీ చేశాక, దాన్ని ఉల్లంఘిస్తే సభ్యుడిపై చర్యలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో విప్ ఉండదు. ఎందుకంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటు ద్వారా ఎన్నిక జరుగుతుంది. ప్రతి సభ్యుడు తన మనసు, తన నిర్ణయం ప్రకారం ఓటు వేయడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాడు.
ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే , ప్రత్యేక మెజార్టీ కావాల్సిందే
సాధారణంగా ఎన్నికలు జరుగుతే మెజార్టీ ఓట్లు సాధించిన వ్యక్తిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అలా జరగదు. ఈ ఎన్నికలో విజేతను నిర్ణయించడానికి సాధారణ మెజారిటీ కాకుండా ప్రత్యేక మెజారిటీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ప్రత్యేక మెజారిటీ అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ రావాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. పోటీలో ఉన్న ఇద్దరిలో ఒకరికి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, ఇంకొకరికి రెండో ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విషయంలో కొన్నిసార్లు సరిగ్గా ఫాలో కాక కొన్ని ఓట్లు చెల్లుబాటు కానీ పరిస్థితులు కూడా ఉంటాయి.
విప్ లేక పోవడం, ప్రాధాన్యత ఓటింగ్ విధానంతో కూటమి పార్టీలకు కొంత టెన్షన్
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు దాదాపు ఖాయమే అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజార్టీ కంటే ఎక్కువ ఎంపీలు ఎన్డీఏ కూటమి పార్టీల నుంచే ఉన్నారు. అయితే ఎన్డీయే కూటమి పెద్దన్న బిజెపికి తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఒక్కరూ కాదనరు. మిగతా పార్టీలు కూడా తమ ఎంపీలను ఈ విషయంలో పదేపదే ఫాలో కూడా చేస్తున్నాయి. అయితే ఇక్కడ వరకు ఎటువంటి టెన్షన్ లేకపోయినా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ లేకపోవడం, పైగా సీక్రెట్ బ్యాలెట్ విధానం, దాంతో ఎవరైనా గీత మారితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు కూడా ఉన్నారు. అందుకే కూటమి వరకే పరిమితం కాకుండా ఇతర పార్టీల వాళ్లను కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
మరోపక్క ఇండియా కూటమి సైతం విప్ లేకపోవడమే, తమకు కలిసొచ్చే అంశమని చెప్తుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ని గెలిపించేందుకు ఎంపీలందరూ ఆత్మ ప్రబోధంతో ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే తమ ఓట్లు చీలకుండా మాత్రమే కాదు, అవతలి వాళ్ళ ఓట్లు తమ అభ్యర్థికి పడేలా ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు కూటమిలు. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నట్లుగానే సులువుగా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారా.. లేదంటే ఆత్మ ప్రభోదంతో ఓటేయాలని కోరుతున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ప్రభావం చూపుతారా సెప్టెంబర్ 9న తేలనుంది.
