Site icon NTV Telugu

ఇక ఆర్టీసీ బస్సులపై ఆ పోస్టర్లు కనిపించవు…

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ సీఎస్‌ సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడేళ్లకు పైగా సైబరాబాద్ సీపీగా సేవలు అందించిన సజ్జనార్‌ పేరు సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పేరు మారుమోగింది. అనంతరం కూడా పోలీస్ వ్యవస్థలో ఆయన తన మార్క్ ను చూపించారు. అయితే ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా ఆయన తన మార్క్ ను చూపిస్తున్నారు. ఆరేళ్ళ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు పరారీలో ఉండగా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్‌ఆర్టీసీ బస్ స్టాండ్స్ లో అలాగే బస్సులో నిందితుడు రాజు ఫోటోను ఉంచాలని సూచించారు. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక పై టీఎస్‌ఆర్టీసీ బస్సుల పైన అభ్యంతరకర మరియు ఆశ్లీల ప్రకటనలు ఉండబోవని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు… అలాంటి పోస్టర్లను ఇంకా పై బస్సులపై అంటించకూడదని… ఇప్పటికే అంటించినవాటిని తొలిగించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ సజ్జనార్‌.

Exit mobile version