Vande Bharat Express starts tomorrow: రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా 5 ట్రైన్లను ప్రారంభించారని.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రేపు ప్రారంభం అయ్యే రైలు ఆరోదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 వందేభారత్ ట్రైన్లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వనించినట్లు వెల్లడించారు.
Read Also: China: చైనాలో కొవిడ్ కల్లోలం.. 35 రోజుల్లోనే 60 వేల మరణాలు
రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అయి విశాఖపట్నం చేరుకుంటుందని వెల్లడించారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. అయితే రేపు ఒక్క రోజు మాత్రం 22 రైల్వే స్టేషన్లలో ఆగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని వెల్లడించారు. అందరికి పరిచయం కావాలనే ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్లలో ఆపుతున్నట్లు వెల్లడించారు.
సంక్రాంతి పండగరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ కానుకగా వందేభారత్ ట్రైన్ ను ప్రారంభిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ డిపార్ట్మెంట్లలోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 10 లక్షల ఖాళీలను గుర్తించామని.. ప్రతీ నెల 70 వేల నుంచి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రెండు విడతల్లో లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు. 2023, ఆగస్టు 15 లోపల 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.