Site icon NTV Telugu

V Hanumantha Rao: మోడీ, కేసీఆర్ ఇద్దరు ఇద్దరే.. భూముల్ని దొరలకు ఇస్తున్నారు

Hanumantha Rao

Hanumantha Rao

V Hanumantha Rao Fires On Narendra Modi And KCR: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు ఇద్దరే అని.. పేదల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఒకరిద్దరు దళితులు చనిపోతే పాత పట్టాదారుల పేరుపై భూమి మార్పిడి చేశారని.. ఇదేనా ధరణి లక్ష్యమని ప్రశ్నించారు. ధరణి మళ్ళీ దొరలకే లాభం చేకూరుస్తోందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ పేదలకు ఇచ్చిన భూములను ఇప్పుడు కేసీఆర్ లాక్కున్నాడని ఆరోపణలు చేశారు. ఆ భూముల్ని దొరలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పంచి పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నానని, తాను కోకాపేట నుంచి కీసర వరకు తిరుగుతానని చెప్పారు. హెచ్ఎండీఏ అధికారులను ఇవరాలు ఇవ్వాల్సిందిగా అడిగానని, కానీ వాళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. హెచ్ఎండీఏ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పేదల భూముల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ప్రస్తుతం తాను పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడలేనని.. త్వరలోనే పీఏసీ కమిటీ వేస్తారని.. ఆ మీటింగ్‌లోనే అన్ని మాట్లాడుతానని చెప్పారు.

అంతకుముందు.. గుత్తికోయల దాడిలో ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ప్రభుత్వ హత్యేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతి చెందటం భాధాకరమని, ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు కవ్వింపు మాటల వల్లే గిరిజనులు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గిరిజనులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తాడని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. రూ. 1 కోటితో పాటు భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని కోరారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హనుమంత రావు వ్యాఖ్యానించారు.

Exit mobile version