తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలలో భాగంగా వచ్చే జనవరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని PCC మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. శాసన సభ రద్దవ్వగానే మే నెలలోనే ఎలక్షన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో తాను గెలవబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ పై ప్రజలు తిరగబడే రోజులు ముందున్నాయని ఉత్తమ్ తెలిపారు.
అయితే ఇదే క్రమంలో ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యే పై మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్పీ, కలెక్టర్ ఎవరు ఆదేశాలతో నేరేడుచర్ల లో మనుషులందరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చి ఇల్లు కూలగొట్టారు.పది గజాలు 20 గజాల్లో కట్టుకున్న ఇళ్లపై ఇంత క్రూరత్వంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఎస్పీ, కలెక్టర్లపై ధ్వజమెత్తారు ఉత్తమ్.
నిజంగా మీరు నిజమైన ఉద్యోగాలు చేయదలుచుకుంటే హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆయన అనుచరులు సుమారు 100 ఎకరాలు ఆక్రమించారు వాటిపై కూడా ఇదే స్థాయిలో అధికారులు స్పందిస్తే దాన్ని ప్రజలు కూడా అభినందిస్తారు..అంతేకాని ఇలాంటి చర్యలు చేయడం అమానుషం. నా 30 సంవత్సరాల రాజకీయాల్లో ఇలాంటివి ఎన్నడూ చూడలేదు అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఆయన గాని రాష్ట్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది అని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా తమ బాధ్యతలను మరిచి పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా మారి అధికార పార్టీకే మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు న్యాయం జరిగే పరిస్థితి ఎక్కడా కనబడటంలేదని ఉత్తమ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
ఇక తాను రైతు భరోసా కార్యక్రమంతో హుజూర్నగర్ నియోజకవర్గంలోని సుమారు 90 గ్రామ పంచాయతీలను చుట్టి రావడం జరిగిందని ఏ గ్రామానికి వెళ్లినా అడుగడుగునా టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ప్రజల ఎత్తి చూపిస్తున్నారని మళ్లీ తామే అధికారం లోకి వస్తాం అని ఉత్తమ్ ఈ మీడియా సమావేశంలో తెలిపారు.