Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!

  • జూన్ 4-5లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
  • ధాన్యం రవాణాకు అన్ని వాహనాలు వినియోగించాలని సూచన
  • తడిసిన ధాన్యానికీ MSP.. రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి
  • ఇప్పటివరకు రూ.16,479 కోట్ల విలువైన 58 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy :  తెలంగాణలో వరి ధాన్యం, మక్కాల (మొక్కజొన్న) కొనుగోలు ప్రక్రియపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జూన్ 4, 5వ తేదీల లోపు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ఎట్టి పరిస్థితిలోనూ నిర్దేశిత గడువు లోగా కొనుగోళ్లు పూర్తి కావాలని అధికారులను అల్టిమేటం జారీ చేశారు. ఎంత ఆర్థిక భారమైనప్పటికీ, రైతుల సంక్షేమం దృష్ట్యా చివరి గింజ కొనుగోలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ధాన్యం రవాణాకు ప్రత్యేక చర్యలు.. ప్రైవేట్ గోదాముల వినియోగం
ధాన్యం తరలింపులో ఎలాంటి ఆలస్యం జరగకూడదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఏ ప్రభుత్వ వాహనాలు అందుబాటులో ఉన్నా, వాటన్నింటినీ ధాన్యం రవాణాకు డైవర్ట్ చేయాలని చెప్పారు. రాబోయే వారం రోజుల్లోగా అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలన్నింటినీ ఇందుకోసం మళ్లించాలని స్పష్టం చేశారు. అలాగే, ధాన్యం నిల్వ చేయడానికి ప్రభుత్వ స్థలాలు సరిపోకపోతే, ఎక్కడ ప్రైవేట్ గోదాములు (Go-downs) ఉన్నా వాటిని వెంటనే ఎంగేజ్ చేసి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.

×
×
Ad

తడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. తరుగు పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు
ఇటీవలి వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం కనీస మద్దతు ధర (MSP) చెల్లించి కొనుగోలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో కొందరు మిల్లుల యజమానులు, బ్రోకర్లు తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత బాధ్యతతో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

రూ. 16,479 కోట్ల విలువైన కొనుగోళ్లు.. రికార్డు సృష్టించిన తెలంగాణ
ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు. ఇప్పటివరకు దాదాపు రూ. 16,479 కోట్ల విలువైన 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సేకరించిందని వెల్లడించారు. ఇంకా మిగిలి ఉన్న 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే కొనుగోలు చేస్తామన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, అత్యంత పారదర్శకంగా , భారీ ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరుపుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు.