Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!

  • కమిషన్ల కోసమే నాణ్యతను విస్మరించారన్న మంత్రి
  • సాంకేతిక పరీక్షల్లో బయటపడ్డ లోపాలు
  • బ్యారేజీల భద్రతపై ఆందోళన వ్యక్తం
  • కాళేశ్వరం నిధులు, సీబీఐ విచారణపై విమర్శలు
Uttam

Uttam

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం , అందులోని లోపాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు, కమిషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టు బ్యారేజీలు దెబ్బతిన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల విషయంలో రాజకీయ దురుద్దేశం ఏమీ లేదని, కేవలం ప్రజల ప్రయోజనాలు , భద్రతను దృష్టిలో ఉంచుకునే వాస్తవాలను బయటపెడుతున్నామని స్పష్టం చేశారు.

సైంటిఫిక్ టెస్టింగ్‌లలో బయటపడిన దారుణాలు..

ఆఫ్రి ఇండియా (Afri India), ఐఐటీ బాంబే (IIT Bombay) నిపుణులతో నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. మేడిగడ్డతో పాటు మరో రెండు బ్యారేజీలకు ‘స్టీల్ ఇన్ బేస్’ సరిగ్గా లేదని నిపుణులు తేల్చిచెప్పారని పేర్కొన్నారు. అప్పట్లో తగినంత సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) కూడా చేయకుండానే ప్రాజెక్టులు నిర్మించారని మండిపడ్డారు.

సరిగ్గా ప్లానింగ్ లేకుండా కట్టి ప్రాజెక్టును కూల్చిన వాళ్లు ఇప్పుడు సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని, “మీ నాలెడ్జ్‌తో కట్టిందే కూలిపోయింది.. ఇకనైనా నోరు మూయండి” అంటూ బీఆర్‌ఎస్ నాయకులకు హితవు పలికారు. అధికారుల కక్కుర్తి, తొందరపాటు నిర్ణయాల వల్లే బ్యారేజీలు దెబ్బతిన్నాయని, కేసీఆర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్వయంగా కాంట్రాక్ట్ సంస్థే లిఖితపూర్వకంగా రాసిచ్చిందని వెల్లడించారు.

నీళ్లు నిండి ఊళ్లు మునిగితే బాధ్యత ఎవరిది?

ప్రస్తుతం అన్నారం బ్యారేజీ ఫౌండేషన్ చాలా బలహీనంగా ఉందని, తీవ్రమైన లీకేజీలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. లీకేజీలు ఉన్నప్పుడు బ్యారేజీ ఏ క్షణంలో కూలుతుందో ఎవరూ చెప్పలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ బ్యారేజీల్లో నీళ్లు నింపి, అవి కూలిపోయి 40 గ్రామాలు మునిగిపోయి జనం చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడలేమని చెప్పారు.

ఎన్‌డీఎస్‌ఏ (NDSA) ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే ఈ లోపాలన్నీ స్పష్టంగా ఉన్నాయన్నారు. అటు కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని వాడకుండానే తెలంగాణ రైతాంగం రికార్డు స్థాయిలో 300 లక్షల టన్నుల పంట పండించిందని, బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా బూటకపు ప్రచారాలు ఆపాలని సూచించారు.

కాళేశ్వరం కాంట్రాక్టర్ల రూ. 1400 కోట్ల ఫండ్స్ 

కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి రూ. 1400 కోట్లు చెక్కుల రూపంలో పార్టీ ఫండ్ కింద తీసుకున్నామని స్వయంగా ఎమ్మెల్సీ కవిత చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోసం సీబీఐకి లేఖ రాసినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ సెట్టింగ్‌కు నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాత కాంట్రాక్ట్ కంపెనీలకు ఎలాంటి పనులూ కట్టబెట్టలేదని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ , జాతీయ స్థాయి నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామని, వచ్చే సమ్మర్  నాటికి రెండు బ్యారేజీలను పునరుద్ధరించి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే తన హయాంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్, దిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్ట్ తీర్పుపై హర్షం

సుప్రీం కోర్టు ఇటీవల పర్యావరణ అనుమతుల విషయంలో ఇచ్చిన తీర్పును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించే ప్రాజెక్టులపై కోర్టు స్టే ఇచ్చేదని, కానీ ఇప్పుడు ‘పోస్ట్ ఫ్యాక్టో’ అనుమతులకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించిందని తెలిపారు. దీనివల్ల తెలంగాణలో గతంలో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.