Site icon NTV Telugu

Uttam Kumar Reddy: రేపిస్టులను విడుదల చేసి.. బీజేపీ తప్పుడు సంకేతాలిచ్చింది

Uttam Kumar On Bilkis Bano

Uttam Kumar On Bilkis Bano

Uttam Kumar Reddy Fires On BJP For Releasing Bilkis Bano Convicts: గుజరాత్‌లోని బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో 11 మంది దోషులను విడుదల చేసి.. బీజేపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన సంకేతాన్ని ఇచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోదాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన ఆ 11 మంది నిందితులు, ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఏడుగురు సభ్యుల్ని హత్య చేసిన ఘటనలో దోషులు అని అన్నారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా రంధిక్‌పూర్ గ్రామంలో ఆ ఘటన జరిగిందని.. దీనిపై బాధిత కుటుంబం సుధీర్ఘ పోరాటం చేసిన తర్వాత నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. కానీ.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసులో శిక్షల్ని తేలిగ్గా తీసేసి, కోర్టులు & న్యాయ వ్యవస్థకు ప్రాముఖ్యత లేదని తప్పుడు సందేశాన్ని పంపిందని అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళలకు గౌరవం, సాధికారతపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ వ్యవహారంపై మౌనం వీడాలని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేదా? అనేది కేంద్రంతో చర్చించి స్పష్టం చేయాలన్నారు. అసలు ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేసిందా? అని ప్రశ్నించారు. ఈ పరిణామాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని.. దేశంలోని ఇతర ప్రభుత్వాలన్నీ తమ పార్టీలకు చెందిన రేపిస్టులను & హంతకులను విడుదల చేయడం ప్రారంభిస్తాయనన్నారు. సామాన్య ప్రజలకు ఉచితాలను వ్యతిరేకించే ప్రధాని మోదీ.. ఇప్పుడు బీజేపీలో చేరితే, రేపిస్టులు & హంతకులకు స్వేచ్ఛను వాగ్దానం చేయవచ్చని అన్నారు. నేర నేపథ్యం ఉన్న సభ్యులు, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని చెప్పారు.

2002 అల్లర్ల ప్రస్తావన లేకుండా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 11 మంది రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం ద్వారా.. ఆ అల్లర్ల వెనుకకున్న వ్యక్తుల్ని బీజేపీ గుర్తు చేసిందని, ఆ అల్లర్లలో చనిపోయిన అమాయకుల శవాలపై రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నించడం నిజంగా సిగ్గు చేటని ఫైరయ్యారు. విడుదలైన రేపిస్టుల్లో అందరినీ లేదా కొందరిని అయినా.. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా బీజేపీ నామినేట్ చేస్తుందన్నారు. ఆ 11 మంది రేపిస్టుల్ని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు గానీ, ఏ హైకోర్టు గానీ పట్టించుకోకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రేపిస్టులకు గుజరాత్ ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసిందని, బీజేపీ సభ్యులుగా ఉంటే వారికి రక్షణ ఉంటుందని తప్పుడు సందేశం పంపిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version