Union Minister Kishan Reddy criticizes CM KCR and KTR: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తండ్రిని, కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్ లా మంత్రి కాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. కేసీఆర్ కన్నా దిగజారి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానం, తప్పుడు ఆలోచనతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరూ బయటకు రాని సమయంలో నేను గాంధీ దవాఖానాతో పాటు ప్రభుత్వం ఆస్పత్రికి వెళ్లానని.. వాళ్లలాగా నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు సేకరించి నిత్యావసర వస్తువులు, ఫుడ్ పంపిణీ చేశానని అన్నారు. రెండు ట్రక్కుల కుర్ కురే ప్యాకెట్లను అనాథ పిల్లలకు పంచానని.. కేటీఆర్ వ్యాఖ్యలు అనాథ పిల్లలను అవమానించడమే అని పేర్కొన్నారు.
Read Also: Sir: కొత్త జర్నీ మొదలుపెట్టిన ధనుష్ ‘సార్’…
తాలిబాన్ రాజ్యం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను దేశపౌరులు ఖండించాలని పిలుపునిచ్చారు. దేశం ఇమేజ్ తగ్గించే విధంగా కల్వకుంట్ల కుటుంబం మాట్లాడుతోందని అన్నారు. సైనికులను అవమానిస్తున్నారని.. దేశ ఆర్థిక వ్యవస్థను పాకిస్తాన్, శ్రీలంకలతో పోలుస్తున్నారని..ఇదేనా మీ మర్యాద, దేశానికి ఇచ్చే గౌరవం ఇదేనా.? అని ప్రశ్నించారు.
తెలంగాణలో 4,549 హెల్త్ వెల్నెస్ సెంటర్ లు(బస్తీ దవాఖాన లతో సహా) కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, తెలంగాణకు రూ.5,550 కోట్ల నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 175 జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేశానమి.. రూ. 146 కోట్లను టీబీ నిర్మూలన కోసం కేంద్రం కేటాయించిందని.. ఫ్లోరోసిస్ నిర్మూలనకు కేంద్రం రూ. 800 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. కరోనా సమయంలో రూ. 300 కోట్లను, రూ. 707 కోట్ల వ్యాక్సిన్లను, పీఎం కేర్ కింద 50 ఆక్సిజన్ ఫ్లాంట్లను తెలంగాణకు ఇచ్చామని తెలిపారు.