ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా నిత్యావసరాలైన కూరగాయలు, మాంసాహారం, చేపలు ఒకే చోట దొరికే విధంగా అన్ని వసతులతో కూడిన మోడల్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందు బాటు లోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో రోడ్లపై అమ్మడం వలన ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. తద్వారా రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దేశిత ప్రమాణాలను గుర్తించి మోడల్ మార్కెట్ల నిర్మాణాలను చేపట్టనుంది. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.19.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు మోడల్ ఫిష్ మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చేప ట్టింది. దీనిలో నాచారం, కూకట్‌పల్లి మార్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. మల్లాపూర్, బేగంబజార్ ఈ రెండు మార్కెట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
ఈపనులను నిర్ధేశించిన సమయంలో పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు. మరో వైపు ఈ మార్కెట్ ప్రదేశాల్లో ట్రాఫిక్ నియంత్రణకు కూడ చర్యలు చేపట్టారు. నారాయణగూడలో పాత మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్‌ను రూ.4కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రజల అవసరాలకు తగినట్టుగా మోడల్ మార్కె ట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది ఇంకా పురోగతిలో ఉంది. దీన్ని కూడా త్వరగా పూర్తి చేసి నగరప్రజలకు అందుబాటులోకి తెవాలని జీహెచ్ ఎంసీ ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా మోడల్ మార్కెట్‌లతో ప్రజలకు సమయం, ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి.
