సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉదయ్‌కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక ఆధారాలు మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు విచారణలో అత్యంత కీలకమైన సూసైడ్ నోట్‌తో పాటు ఇతర వివరాలు ఉన్న ఆయన ఐఫోన్ ప్రస్తుతం మాయమైంది. కస్టడీ విచారణ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూసైడ్ నోట్‌పై నేరుగా ప్రశ్నించగా, తాను కేవలం మద్యం తాగిన మైకంలోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశానని, ప్రస్తుతం అది ఎక్కడ ఉందో తనకు తెలియదని ఉదయ్‌కృష్ణారెడ్డి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం.. మరో సెక్షన్ నమోదు
తాను మద్యం తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పిన ఉదయ్‌కృష్ణారెడ్డి, విచారణాధికారులను , పోలీసులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు గానూ ఆయనపై మరో అదనపు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కస్టడీ గడువు ముగియడంతో ఉదయ్‌కృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కీలక ఆధారాలు ఉన్న ఫోన్‌ను అప్పగించకపోవడం, దర్యాప్తునకు ఏమాత్రం సహకరించకపోవడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

