Site icon NTV Telugu

TSRTC: ప్రయాణికులకు శుభవార్త.. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఆఫర్‌ను ఆర్టీసీ ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్‌ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నగరానికి చేరుకున్న ప్రయాణికులు రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా వెళ్లవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్‌లైన్‌ లేదా బుకింగ్‌ కేంద్రాల వద్ద రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చని ఆర్టీసీ అధికారులు సూచించారు. నాన్‌ ఏసీ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు నాన్‌ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్‌ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు.

Exit mobile version