NTV Telugu Site icon

TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!

Ts Police

Ts Police

TS Police: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ రోజు (ఫిబ్రవరి 15) నుండి ఫిజికల్ ఈవెంట్‌లను నిర్వహించనుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా, కోర్టు ఆదేశాలతో పలువురు ఎస్సీ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు నేటి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. ఈపరీక్షలో ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట డిసెంబర్ 8 నుంచి 31 వరకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. అవి కనిష్టంగా 9 రోజులు కాగా.. గరిష్టంగా 24 రోజులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేటలో వీటిని నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందిని అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.

Read also: Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్‌ మృతి, 9 మందికి గాయాలు

ఇప్పుడు కొన్ని కేంద్రాలను తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు 60 మార్కులు సాధించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫలితాలు విడుదల చేసి వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో 2.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది రాత పరీక్షలకు ఎంపిక చేశారు. ఆ పరీక్షలను మార్చిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ రాతపరీక్షలో తప్పు ప్రశ్నలను తొలగించకుండా.. వాటికి మార్కులను జోడించాలనే డిమాండ్ మొదలైంది. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన కోర్టు మార్కులు కలిపి వేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కులు కలిపి 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.
Yadagirigutta: 21 నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ దంపతులు